ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులకు కేటీఆర్ ఫోన్

ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులకు కేటీఆర్ ఫోన్
  • ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులను తన ఆఫీసుకు పిలిపించుకుని శాలువా కప్పి.. ఫైన్ కట్టిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: నిబంధనలు అతిక్రమించిన తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తన వాహనానికి విధించిన చలాన్ ను మంత్రి కేటీఆర్ చెల్లించారు. నిబంధనలు ప్రజల కైనా ప్రజాప్రతినిధులకైనా ఒకటే అన్న ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిజాయితీగా నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
రెండు రోజుల కింద రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి కేటీఆర్ వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని మంత్రి కేటీఆర్ సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా....నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.  ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో  తాను ఎల్లవేళలా ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజు సైతం వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు.

రెండు రోజుల క్రితం బాపు ఘాట్ లో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా మంత్రి కేటీఆర్ వాహనం రాంగ్ రూట్లో వస్తుండగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లుతో కలసి అడ్డుకున్నారు. తమ నాయకుడి వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడం గమనించిన టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోసేసే ప్రయత్నం చేయడం వివాదాస్పదం అయింది. మంత్రి వాహనమైనా నిబంధనలు పాటించాల్సిందేనంటూ  నిబంధనల ప్రకారం చలాన్ విధించారు ఎస్ ఐ ఐలయ్య. విషయం మీడియాలో రావడంతో మంత్రి కేటీఆర్ స్పందించి ట్రాఫిక్ పోలీసులను తన ఆఫీసుకు రమ్మని ఆహ్వనించారు. సోమవారం మంత్రి కేటీఆర్ ఆఫీసుకు వెళ్లిన ఎస్.ఐ ఐలయ్య,  కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు లకు శాలువా కప్పి అభినందించారు మంత్రి కేటీఆర్.

విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే ఐలయ్య లాంటి అధికారులకి ఎప్పుడూ తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ తన వాహనానికి విధించిన చలాన్ ను సైతం చెల్లించారు. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు నాయకులకు సరైన సందేశం అందేందుకే ఈరోజు ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన విషయాన్ని,  పార్టీ శ్రేణులు గుర్తించాలని కేటీఆర్ అన్నారు.