రూ.లక్ష స్కూటర్‌‌కు రూ.21 లక్షల ఫైన్..ఉత్తరప్రదేశ్‌‌లో బైకర్‌‌కు ఊహించని షాక్

రూ.లక్ష స్కూటర్‌‌కు రూ.21 లక్షల ఫైన్..ఉత్తరప్రదేశ్‌‌లో బైకర్‌‌కు ఊహించని షాక్
  • సోషల్ మీడియాలో చలాన్ ఫొటో వైరల్
  • పొరపాటున ఎక్కువ ఫైన్ పడిందన్న ట్రాఫిక్ పోలీసులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌‌లోని ముజఫర్‌‌నగర్‌‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. రూ. 1 లక్ష విలువైన స్కూటర్‌‌కు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ. 21 లక్షల జరిమానా విధించారు. హెల్మెట్ ధరించకపోవడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ డాక్యుమెంట్స్ లేకపోవడంతో బైకర్‌‌కు ఇంత పెద్ద మొత్తంలో చలాన్ వేశారు.  అయితే, చలాన్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు ఫైన్ మొత్తాన్ని రూ. 4,000కి సరిచేశారు. 

ముజఫర్‌‌నగర్ జిల్లాలోని న్యూ మండికి చెందిన అన్మోల్ సింగల్‌‌ మంగళవారం తన స్కూటర్‌‌పై బయలుదేరాడు. గాంధీ కాలనీ చెక్‌‌పాయింట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు రొటీన్ చెక్‌‌లో భాగంగా అతన్ని ఆపారు. హెల్మెట్ లేకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు లేకపోవడంతో స్కూటర్‌‌ను సీజ్ చేశారు. అన్మోల్ సింగల్‌‌కు రూ. 20,74,000 చలాన్ జారీ చేశారు. చలాన్ చూసి షాకైన అన్మోల్.. చలాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే అది వైరల్ అయింది.ట్రాఫిక్ పోలీసులపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. 

మా తప్పిదం వల్లే..

చలాన్ ఫొటో వైరల్ అవడంతో ముజఫర్‌‌నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. చలాన్ జారీ చేసిన సబ్-ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వల్లే  పొరపాటున ఇంత మొత్తం ఫైన్ పడిందన్నారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ (ఎంవీఏ యాక్ట్) సెక్షన్ 207 కింద చలాన్ జారీ చేశారని తెలిపారు

కానీ సబ్-ఇన్స్పెక్టర్ 207 తర్వాత 'ఎంవీఏ యాక్ట్' అని పేర్కొనడం మర్చిపోయాడని చెప్పారు. అందువల్లే 207..జరిమానా మొత్తం రూ. 4,000 ఒకే సంఖ్యగా మారిందని వివరణ ఇచ్చారు. తప్పును సరిచేసి రూ. 4 వేలు జరిమానాతో కూడిన నిజమైన చలాన్ ఇచ్చామన్నారు. అన్మోల్ సింగల్‌‌ 4 వేలు కడితే సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు.