- టోలిచౌకి, నానల్ నగర్, రేతిబౌలి పరిసరాల్లో మళ్లింపులు
మెహిదీపట్నం, వెలుగు: బక్రీద్ పండుగ నేపథ్యంలో టోలిచౌకి, నానల్ నగర్, రేతిబౌలి పరిసరాల్లో మేకలు, గొర్రెల విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, మళ్లింపులు చేపట్టారు. 2026 మే 27, 28 తేదీల్లో సాయంత్రం 5:00 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.
- ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
- రాయదుర్గం, గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వాహనదారులు.. షేక్‌పేట ఫ్లైఓవర్ కింద నుంచి ఫిల్మ్ నగర్ రోడ్డు ద్వారా లేదా ఫ్లైఓవర్ ర్యాంప్ దాటిన తర్వాత బృందావన్ కాలనీ మీదుగా వెళ్లాలి.
- లక్డీకాపూల్ నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి వైపు వెళ్లే వారు మాసాబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద కుడి వైపునకు తిరిగి, బంజారాహిల్స్ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి.
- మెహిదీపట్నం నుంచి రాయదుర్గం, గచ్చిబౌలి వైపు వాహనాలు నానల్ నగర్ జంక్షన్ వద్ద ఎడమ వైపునకు తిరిగి, లంగర్ హౌస్ - నార్సింగి రోడ్డు మీదుగా ప్రయాణించాలి.
- మాసాబ్ ట్యాంక్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లే వారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 2, 3 వద్ద ఎడమ మలుపు తీసుకుని, మిరాజ్ కేఫ్ - గుడిమల్కాపూర్ మార్గం ద్వారా వెళ్లాలి.
- రాత్రి వేళల్లో మెహిదీపట్నం– టోలిచౌకి మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ మార్గంలో ప్రయాణించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. బస్సులన్నీ తప్పనిసరిగా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగానే వెళ్లాలని సూచించారు.
- ప్రయాణికులు తాజా సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ఖాతాలను గమనించాలని, అత్యవసర సమయాల్లో 9010203626 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు.
బక్రీద్ సందర్భంగా సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి, న్యూ పెన్షన్ లైన్ ప్రాంతాల్లో విక్రయానికి ఉంచిన కొన్ని ప్రత్యేక జాతి గొర్రెపోతులు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ధర పలుకుతున్నాయి. ఈ గొర్రెపోతులకు ప్రత్యేకమైన పోషణతో పాటు పౌష్టికాహారాన్ని అందించడం వల్ల, వీటి మాంసం ఎంతో రుచిగా, నాణ్యతతో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
