హైదరాబాద్ సిటీ, వెలుగు : నెక్లెస్ రోటరీ సమీపంలోని లేక్ వ్యూ పార్క్ వద్ద శుక్రవారం సాయంత్రం 4 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రోగ్రాం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. సెక్రటేరియేట్వైపు నుంచి ఐ-మాక్స్ వైపు వెళ్లడానికి అనుమతి లేదని, ఈ రూట్లో వచ్చే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ విగ్రహం వైపు మళ్లిస్తామన్నారు.
నెక్లెస్ రోడ్ (పీపుల్స్ ప్లాజా), ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుంచి ఐ-మాక్స్ వైపు వెళ్లడానికి వీల్లేదు. వీరు సెక్రటేరియేట్వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్బాల్ మినార్ నుంచి చెట్టు, మింట్ కాంపౌండ్, ప్రింటింగ్ ప్రెస్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను సచివాలయం జంక్షన్ వైపు పంపిస్తారు. బడా గణేశ్లైన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మింట్ కాంపౌండ్ లైన్‌కు మళ్లిస్తారు.
తిరంగా ర్యాలీతో..
ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని ఎం-47 ప్యాటన్ ట్యాంక్ వరకు తిరంగా ర్యాలీ దృష్ట్యా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కర్బాలా మైదాన్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ వైపునకు, డీబీఆర్ మిల్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను గోశాల కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
