హైదరాబాద్: మల్లారెడ్డి యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఈవెంట్కు మల్లారెడ్డి యూనివర్సిటీలోనే జరగడంతో వేల మంది విద్యార్థులు ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే.. దురదృష్టవశాత్తూ సౌండ్ స్పీకర్స్ విద్యార్థుల మీద పడ్డాయి. హీరో యష్ వేదిక మీదకు వెళ్లి స్పీచ్ ఇస్తున్న సందర్భంలో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు.
ఎంత మంది విద్యార్థులు గాయపడ్డారనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. హీరో యష్ కూడా మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటనపై స్పందించాడు. ఎవరికీ ఏం కాలేదుగా.. సేఫ్ గానే ఉన్నారుగా అని ఒకటికి రెండు సార్లు అడిగాడు. ఏం కాలేదని నిర్వాహకులు చెప్పడంతో తన స్పీచ్ను కొనసాగించాడు. కానీ.. విద్యార్థులు అంత పెద్ద స్పీకర్లు మీద పడటంతో గాయపడ్డారు.
స్పీకర్స్ సెట్ చేసి ఉంచే పోల్స్ లాంటి వాటి పైకి కూడా విద్యార్థులు ఎక్కడంతో ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే విద్యార్థులు భారీగా తరలివెళ్లి ఉక్కిరిబిక్కిరి అవ్వడంతో విద్యార్థులని ఈవెంట్ జరగక ముందే పోలీసులు వెనక్కి పంపించేశారు.
తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండడంతో విద్యార్థులకు పోలీసులు, మల్లారెడ్డి వెనక్కి వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. కొందరు విద్యార్థులు వెనక్కి వెళ్లిపోయినప్పటికీ వేల మంది విద్యార్థులు యూనివర్సిటీలోనే ఉండటం, అందరూ వేదికకు దగ్గరలో.. ఇలా సౌండ్ స్పీకర్లు సెట్ చేసి ఉండే వాటి మీదకు ఎక్కడంతో ఈ దుర్ఘటన జరిగింది.
