రీల్స్ పిచ్చి ప్రాణాలు తీసింది.. వైరల్ రీల్స్ చేస్తుండగా.. రైలు ఢీకొని ముక్కలైన టీనేజర్.. వీడియో వైరల్

రీల్స్  పిచ్చి ప్రాణాలు తీసింది.. వైరల్  రీల్స్  చేస్తుండగా.. రైలు ఢీకొని ముక్కలైన టీనేజర్.. వీడియో వైరల్

రీల్స్​ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది. సోషల్​ మీడియాలో ఫేమస్​ అయ్యేందుకు, వ్యూస్​, లైకులు, ఫాలోవర్స్ కోసం యువత ఇప్పుడు వింత పోకడలు, వెర్రి చేష్టలు చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి రీల్స్​ చేస్తున్నారు. రోడ్లపై డ్యాన్సులు, ట్రాఫిక్ మధ్యలో వీడియోలు తీయడం,మరికొందరు రైలు పట్టాలపై, వంతెనలపై, ఎత్తైన భవనాల పైకప్పులపై ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఒడిశాలోని పూరిలో రైలు పట్టాలపై రీల్స్​ చేస్తూ టీనేజర్​ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఆ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. 

రైల్వే బ్రిడ్జిపై రీల్స్​ చేస్తుండగా రైలు ఢీకొని పూరికి చెందిన 15 ఏళ్ల టీనేజర్ చనిపోయాడు. పూరి పట్టణ సమీపంలోని మంగ్లాఘాట్​ కు చెందిన బిశ్వజిత్​ సాహు..  మంగళవారం సాయంత్రి సమీపంలోని రైల్వే బిడ్జిపై రీల్స్ చేస్తుండగా  వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అతని శరీర భాగాలు తునాతునకలయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. 

వైరల్​ అవుతున్న వీడియోలో టీనేజర్​  బిశ్వజిత్​ సాహు రైలు ఢీకొనడంతో ట్రాక్​ పై పడిపోయినట్లు కనిపిస్తోంది. ఘటన తర్వాత కూడా కెమెరా రికార్డింగ్​ ఆన్​ లోనే ఉండటంతో తర్వాత కూడా దృశ్యాలు రికార్డయ్యాయి. రైలు దాటిన తర్వాత అతని స్నేహితుల్లో ఒకరు అతని వైపు పరుగెత్తుకుంటూ వచ్చి అతని పేరు 'సాహు... సాహు' అని పిలిచారు కానీ అతను స్పందించలేదు. అప్పటికే సాహు మృతిచెందాడు. ఈ ఘటనలో మరో టీనేజర్​ కూడా గాయపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఒడిశా రైల్వే పోలీసులు ..మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

రీల్స్​ పిచ్చిలో ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టడం ఇదే మొదటిసారి కాదు.. రీల్స్ చేస్తూ చాలా సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.