
హైదరాబాద్, వెలుగు: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్, తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఫిబ్రవరి 14 న రాత్రి 7.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి ‘సికింద్రాబాద్-తిరుపతి’ స్పెషల్ ట్రైన్ బయల్దేరుతుందని, ఇదే రైలు తిరిగి ఫిబ్రవరి 16 న సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ అవుతుందని పేర్కొంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది. ఫిబ్రవరి 14 న రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సికింద్రాబాద్– కాకినాడ స్పెషల్ ట్రైన్ బయల్దేరుతుందని పేర్కొంది. ఇదే రైలు తిరిగి 16 న రాత్రి 8.50 గంటలకు కాకినాడ టౌన్‌లో స్టార్ట్ అవుతుందని చెప్పింది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరంటౌన్, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.