టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియకు ప్లాన్ రెడీ

టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియకు ప్లాన్ రెడీ

హైదరాబాద్, వెలుగు: జూన్ లో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఉంటుందని టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్​రెడ్డి, కమలాకర్​రావు తెలిపారు. జూన్​ తొలి వారంలో కేజీబీవీ, మోడల్ స్కూల్ టీచర్లకు, మూడో వారంలో సర్కారు, పంచాయతీరాజ్​ టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసేందుకు మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయని చెప్పారు. ఈ విషయమై మంగళవారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఎమ్మెల్సీ, పీఆర్టీయూ రాష్ట్ర నేతలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బదిలీలకు మార్గదర్శకాలపై చర్చించారు. త్వరలో టెన్త్ ఎగ్జామ్స్​ ప్రారంభం కానున్నాయని, పరీక్షలు పూర్తి కాగానే బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసినట్టు వివరించారు. పండిట్, పీఈటీలకు సంబంధించి జూన్ 17న కోర్టు విచారణ ఉన్నందున.. కోర్టు మార్గదర్శకాలను అనుసరించి ప్రమోషన్లు కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రైమరీ స్కూల్​ హెచ్ఎం పోస్టులను 10 వేలకు పెంచుతూ చేసిన ప్రతిపాదనలు సీఎంవోకు పంపించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25 వేలకు పైగా సర్కారు, పంచాయతీరాజ్ టీచర్లు ప్రమోషన్లు పొందుతారని స్పష్టం చేశారు. కాగా, జూన్​లో ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేస్తామని మంత్రి చెప్పిన తర్వాత కూడా కొన్ని సంఘాలు ధర్నాలు చేస్తామనడం తగదని, ఇదంతా ఉనికి కోసమేనని పీఆర్టీయూ నేతలు విమర్శించారు.