ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడా..ఒక్కరోజే 245 బస్సులు, వ్యాన్లపై కేసులు, 60 బస

ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ లేని స్కూల్ బస్సులపై రవాణా శాఖ కొరడా..ఒక్కరోజే 245 బస్సులు, వ్యాన్లపై కేసులు, 60 బస
  • తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆర్టీఏ అధికారుల వెల్లడి

హైదరాబాద్, వెలుగు: స్కూళ్లు ప్రారంభమైన మొదటి రోజే ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ లేని పలు విద్యాసంస్థల బస్సులపై రవాణాశాఖ అధికారులు కొరఢా ఝుళిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ లేని 245 బస్సులపై కేసులు నమోదు చేసి, 60 బస్సులను సీజ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం స్కూల్ బస్సులు 25,987 ఉండగా, 23,204 బస్సులు ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్ పొందినట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన 2,783  బస్సులు ఈ సర్టిఫికెట్లు పొందాలని సూచించారు.

ఈ తనిఖీలు ప్రతిరోజూ కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్లు పొందని జిల్లాల్లో రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలే మొదటి మూడు వరుసల్లో ఉన్నట్లు తెలిపారు. ఈ జిల్లాల్లోని పలు విద్యాసంస్థలకు రాజకీయ నేతల ప్రత్యక్ష, పరోక్ష అండదండలు ఉండడంతోనే యాజమాన్యాలు స్కూల్ బస్సుల ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని  రవాణాశాఖ అధికారులు ‘‘రూల్ ఈజ్​రూల్’’ అనే రీతిలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అందుకే సోమవారం ఒక్క రోజే 245 ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేశారు. అందులో 60 బస్సులను సీజ్ చేసి రాజకీయ ఒత్తిళ్లకు లొంగేది లేదని అధికారులు స్పష్టం చేశారు. స్కూల్ బస్సులకు విధిగా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్ అనుభవం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ కంట్రోల్ ఎక్విప్​మెంట్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, వాహనాల బ్రేక్‌‌‌‌‌‌‌‌లు, టైర్ల క్వాలిటీ, లైట్లు ఇతర మెకానికల్ పార్ట్స్ ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని వెల్లడించారు.

ఇందులో ఏ ఒక్కటి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా కేసులు నమోదు చేస్తామని, ఉల్లంఘనలు తీవ్ర స్థాయిలో ఉంటే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. సామర్థ్యానికి మించి పిల్లలను బస్సుల్లో తీసుకెళ్లినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బస్సుల్లో విద్యార్థుల రవాణా పూర్తి బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలదేనని సూచించారు.