ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.1% పెంపు..జనవరి 2026 నుంచి అమలు

ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ 2.1% పెంపు..జనవరి 2026 నుంచి అమలు
  • ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం
  • ఈ పెంపుతో 50.7 శాతం నుంచి 52.8 శాతానికి డీఏ
  • సంస్థపై ప్రతి నెలా రూ. 2.82 కోట్ల అదనపు భారం
  • 38 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు లబ్ధి

హైదరాబాద్, వెలుగు:ఆర్టీసీ ఉద్యోగులకు 2.1శాతం డీఏ ( కరువు భత్యం) పెంచుతున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ పెంపుతో ఇప్పటి వరకూ ఉన్న 50.7 శాతం డీఏ 52. 8 శాతానికి చేరుకుందన్నారు. శుక్రవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి పొన్నం..ఆ తర్వాత ఈ కీలక ప్రకటన చేశారు. ఈ డీఏ పెంపుతో ఆర్టీసీ సంస్థపై ప్రతి నెలా రూ. 2.82 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. 

ఆర్టీసీలో ఉన్న 38 వేల మంది ఉద్యోగులు, కార్మికులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ 3 నెలల డీఏ బకాయిలు ఏప్రిల్ నెల జీతంతో పాటు ఉద్యోగుల ఖాతాలో జయచేస్తారన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న డీఏలను తమ ప్రభుత్వం వరుసగా విడుదల చేస్తూ వస్తున్నదని మంత్రి తెలిపారు. నిరుడు జులైలో ప్రభుత్వం 2.1 శాతం డీఏను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. 

ప్రజా పాలనలో తమ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు, కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. డీఏ పెంపుతోపాటు అంతకుముందు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న కారుణ్య నియామకాలు చేపట్టామని చెప్పారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి.. దీర్ఘకాలంగా విధులకు దూరమైన వారిని తిరిగి తీసుకోవడంతోపాటు కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్టీసీ ఆసుపత్రిని ఆధునీకరించామని చెప్పారు. సంస్థలో ఖాళీలను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.