చిక్కిన చిరుత చనిపోయింది

చిక్కిన చిరుత చనిపోయింది

నెహ్రూ జూపార్కుకు తరలిస్తుండగా దారిలో మృతి 
పొలంలోని ఉచ్చులో చిక్కడంతో పోలీసులకు సమాచారమిచ్చిన రైతులు
మత్తు ఇంజక్షన్లు, వలతో పట్టుకునేందుకు ప్రయత్నం
ఉచ్చు తెంచుకుని అధికారులపై దాడి

నల్గొండ, వెలుగు:  జనావాసాల్లోకి వచ్చిన చిరుత చివరకు ప్రాణాలు వదిలింది. పోలీస్, అటవీశాఖల మధ్య సమన్వయం కొరవడడం, ఎండ తీవ్రతకు తట్టుకోలేక మృతిచెందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని రాజపేట తండా గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పంటల రక్షణ కోసం స్థానిక రైతులు ఉచ్చు బిగించారు. వలలో చిక్కుకుని గాండ్రిస్తున్న చిరుతను గురువారం ఉదయం గమనించిన రైతులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలియడంతో చిరుతను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు.

ఆపరేషన్​ ఇలా…

చిరుత ఉచ్చులో చిక్కుకుందని రైతులు ఉదయం 7 గంటల ప్రాంతంలోనే స్థానిక పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గంటన్నర వ్యవధిలోనే వారంతా చిరుత చిక్కుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. కానీ వలలో చిక్కిన చిరుతను పట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేకపోయారు. హైదరాబాద్​ నుంచి నెహ్రూ జూపార్కు అధికారులు వచ్చేవరకు వేచి చూడాల్సి వచ్చింది. హైదరాబాద్​నుంచి రెస్క్యూ టీమ్​ సిబ్బంది 10.30 గంటల ప్రాంతంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఎండ తీవ్రత పెరిగిపోయింది.

రెస్క్యూ టీమ్​ జీపుపైన వల వేసి, మత్తు ఇంజక్షన్ల గన్​తో చిరుతను షూట్ ​చేశారు. దీంతో భయపడ్డ చిరుత ఒక్కసారిగా ఉచ్చు తెంచుకుని అధికారులపై దాడి చేసింది. దీంతో అక్కడ ఉన్నవారంతా తలోదారికి పరుగెత్తారు. రెస్య్కూటీమ్​లోని శివపైన చిరుత దాడి చేయడంతో అతని భుజానికి గాయమైంది. అదేసమయంలో మరోవైపుకు పరుగెత్తుతున్న ఉస్మాన్​ వీపుపై పంజాతో కొట్టింది. దాడిచేసేందుకు ప్రయత్నిస్తున్న చిరుతను నిలువరించేందుకు సీఐ శ్రీనివాస్ రెడ్డి తన చేతిలో ఉన్న కర్రతో కొట్టేందుకు ప్రయత్నించినా చిరుత వేగాన్ని అడ్డుకోలేకపోయారు. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీమ్​ మత్తు ఇంజక్షన్లతో వరుసగా ఐదారుసార్లు షూట్​ చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించగా ఇంజక్షన్ల దాడితో చివరకు చిరుత మత్తుతో కుప్పకూలిపోయింది. పూర్తిగా మత్తులోకి జారుకుందని ధ్రువీకరించుకున్నాక చిరుతను బోన్​లోకి ఎక్కించి జూపార్కు వాహనంలో హైదరాబాద్​కు తరలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రెస్క్యూ టీమ్​ ఆపరేషన్​ ముగిసింది.

భయం, గాయాలతో..

చిరుతను తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయిందని నెహ్రూ జూపార్కు అధికారులు వెల్లడించారు. తీవ్ర భయాందోళన, అంతర్గత గాయాల కారణంగా చనిపోయినట్లు పోస్టుమార్టంలో తేలిందని జూ అధికారులు తెలిపారు. జూలో పోస్టుమార్టం అనంతరం అవయవాలను ఫోరెన్సిక్​ ల్యాబ్ కు తరలించారు. అయితే బుధవారం రాత్రి చిరుత ఉచ్చులో చిక్కుకుందని అప్పటి నుంచి తాగేందుకు నీళ్లు, తినేందుకు ఆహారం లేకపోవడంతో అలమటించిన చిరుత చివరకు మృతిచెందిందని ఫారెస్ట్​ అధికారులు అంటున్నారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైనా అధికారుల వద్ద కచ్చితమైన ఆధారాల్లేవు. రోజుకు 40, 50 కి.మీ. చిరుత ప్రయాణిస్తుందని, అమ్రాబాద్​ అడవుల నుంచి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. చిరుత చిక్కుకున్న ప్రాంతానికి సమీపంలో అడవి పంది మృతదేహం ఉందని అంటున్నారు. ఈ వాసన పసిగట్టిన చిరుత దాన్ని తినేందుకు వచ్చి వలలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..

ఇవాళ కొండపోచమ్మ సాగర్‌‌‌‌కు నీళ్లు