జులై 5 నుంచి సీపీగెట్ ఎగ్జామ్స్

జులై 5 నుంచి  సీపీగెట్ ఎగ్జామ్స్
  •     18 నుంచి వచ్చే నెల 17 వరకు దరఖాస్తుల ప్రక్రియ
  •     నోటిఫికేషన్ రిలీజ్ చేసిన బుర్రా వెంకటేశం, లింబాద్రి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 8 సర్కారు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్) నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నెల 18 నుంచి జూన్ 17 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. బుధవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీసులో టీఎస్​ సీపీగెట్ –2024 నోటిఫికేషన్​ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, టీఎస్​ సీహెచ్​ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ రిలీజ్ చేశారు. సీపీగెట్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా వర్సిటీ, జేఎన్టీయూహెచ్​ పరిధిలోని పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టనున్నట్టు వారు ప్రకటించారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేయనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు రూ.500 ఫైన్​ తో జూన్ 18 నుంచి 25 వరకూ, రూ.2వేల ఫైన్ తో జూన్ 26 నుంచి30 వరకూ అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. జులై 5 నుంచి సబ్జెక్టుల వారీగా ఆన్​లైన్ లో సీపీగెట్ ఎగ్జామ్స్ ఉంటాయని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు https://cpget.tsche.ac.in, http://www.ouadmissions.com వెబ్ సైట్లు చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఓయూ వీసీ రవీందర్, సీపీగెట్ కన్వీనర్ పాండు రంగారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా 294 పీజీ కాలేజీల్లో 51 కోర్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గతేడాది లాగే సెకండ్ ఫేజ్ పూర్తయ్యాక పదిలోపే అడ్మిషన్లు అయితే, ఆ కాలేజీలో ఆ కోర్సులను రద్దు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిల్ సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్, వీసీలు గోపాల్ రెడ్డి, మల్లేశం, విజ్జులత, ఓయూ రిజిస్ర్టార్ లక్ష్మీనారాయణ, టీయూ రిజిస్ర్టార్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.  

గతేడాది నిండింది 43.46శాతమే..

గతేడాది రాష్ట్రవాప్తంగా పీజీ కోర్సుల్లో మొత్తం 47,211  సీట్లుండగా, వాటిలో కేవలం 20519 (43.46%)సీట్లు మాత్రమే నిండాయి. దీంట్లో 5412 మంది అబ్బాయిలుండగా, 15,107 మంది అమ్మాయిలున్నారు. అయితే, ఎంఏ కన్నడ, మరాఠి కోర్సుల్లో ఒక్కరూ చేరలేదు. అత్యధికంగా ఎంకామ్ 2184 మంది, ఎంఎస్సీ కెమిస్ర్టీ 2183 మంది చేరగా, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు,ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, బాటనీ, మ్యాథ్స్, జువాలనీ తదితర కోర్సుల్లో వెయ్యికిపైగా స్టూడెంట్లు చేరారు.