ఉద్యాన శాఖను బలోపేతం చేయాలి : తెలంగాణ ఉద్యాన అధికారుల సంఘం

ఉద్యాన శాఖను బలోపేతం చేయాలి : తెలంగాణ ఉద్యాన అధికారుల సంఘం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యానవన శాఖను బలోపేతం చేసి, రైతులకు మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ ఉద్యాన అధికారుల సంఘం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సిబ్బంది కొరత వల్ల ఒక్కో అధికారి 5 నుంచి 10 మండలాల బాధ్యతలు మోయాల్సి వస్తోందని, ఫలితంగా రైతులకు సకాలంలో సాంకేతిక సలహాలు, పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వరి సాగు 259 శాతం పెరిగితే, కూరగాయల సాగు 81 శాతం పడిపోయిందని తెలిపింది.

ఏటా రూ.5 వేల కోట్ల విలువైన కూరగాయలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొంది. రైతు కమిషన్ సిఫార్సుల మేరకు ప్రతి మండలానికి ఒక విస్తరణ అధికారిని, 2 నుంచి 3 మండలాలకు ఒక ఉద్యాన అధికారిని నియమించాలని కోరింది.  ఆయిల్‌‌పామ్, సూక్ష్మ సేద్యానికి ప్రత్యేక సిబ్బందిని కేటాయించి, పెండింగ్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేపడుతామని హెచ్చరించింది.