సనత్ నగర్ టిమ్స్లో ట్రయల్ రన్ షురూ.. మొదటి రోజు 30 మంది పేషెంట్లకు ఓపీ సేవలు

సనత్ నగర్ టిమ్స్లో ట్రయల్ రన్  షురూ.. మొదటి రోజు 30 మంది పేషెంట్లకు ఓపీ సేవలు
  • క్రమంగా పేషెంట్ల సంఖ్య పెరుగుతుందన్న అధికారులు
  • లోటు పాట్లు సరిచేసుకుంటూ.. నెల రోజుల్లో పూర్తి స్థాయి వైద్యం
  • జూన్ 2న సీఎం రేవంత్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించే అవకాశం

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్​ సనత్ నగర్ లోని  తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) లో ట్రయల్ రన్ మొదలైంది. ఇందులో భాగంగా శుక్రవారం వైద్య సేవలు  ప్రారంభమయ్యాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ వెయ్యి బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొదటిరోజే సుమారు 30 మంది పేషెంట్లు వచ్చి ఓపీ సేవలు పొందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఓపీతో పాటు ప్రైమరీ ల్యాబ్ టెస్టులు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ఇన్ పేషంట్ సేవలతో పాటు పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెస్తామని స్పష్టంచేశారు.  

  • అందుబాటులోకి 22 విభాగాలు..

పేషెంట్లకు అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట దొరకాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏకంగా 22 కీలక డిపార్ట్మెంట్లను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్,     నెఫ్రాలజీ, యూరాలజీ. గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ, పల్మనాలజీ, గైనకాలజీ, డెర్మటాలజీ వంటి 22 డిపార్ట్‌‌‌‌ మెంట్లలో నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం ఓపీ సేవలతో పాటు బ్లడ్, యూరిన్  తదితర టెస్టులు చేస్తున్నారు. పెద్ద ఆపరేషన్లకు సంబంధించిన థియేటర్లు, ఐసీయూ బెడ్ల ఏర్పాట్లు కూడా  స్పీడ్ గా జరుగుతున్నాయి.

  • ప్రారంభం రోజే నిరాటంకంగా అన్ని సేవలు... 

నెల రోజుల పాటు ఈ హాస్పిటల్ లో ట్రయల్ రన్ కొనసాగనున్నది. ఈ సమయంలో సాఫ్ట్‌‌‌‌ వేర్ పనితీరు, మెషీన్ల టెస్టింగ్, పేషెంట్ల నమోదులో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను గుర్తించి అధికారులు సరిచేస్తారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ను అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ రోజు నుంచే పూర్తిస్థాయి అడ్మిషన్లు, మేజర్ సర్జరీలు, అన్ని రకాల స్కాన్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేషెంట్లకు అందేలా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.