
హైదరాబాద్, వెలుగు: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఔట్సోర్సింగ్, డైలీ వేజ్ వర్కర్లు సోమవారం హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమను పర్మినెంట్ చేయాలని, అందరికీ సమాన వేతనం ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రెండు గంటల పాటు వర్షంలోనే ధర్నా చేశారు. వర్కర్లు, సీఐటీయూ నేతలతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ క్రిస్టినా చర్చలు జరిపారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లిస్తామని, ప్రతి కార్మికుడి వ్యక్తిగత ఖాతాలోనే వేతనం జమచేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి, కమిషనర్ హామీ ఇచ్చారు. అన్ని జిల్లాల్లో కనీస వేతనాల సర్క్యులర్‌ను అమలు చేసి ఎరియర్స్ కూడా చెల్లిస్తామన్నారు.
జీవో 212, 16 అమలు ప్రభుత్వ పరిశీలనలో ఉందని, న్యాయ, పరిపాలన సంబంధమైన అన్ని విషయాలను పరిశీలించి పర్మినెంట్ చేసే అంశంపై చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తింపు కార్డులు, వేతనాల చెల్లింపులకు అవసరమైన వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నామని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని మంత్రి చెప్పడంతో వర్కర్లు ధర్నాను విరమించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ మంత్రి, కమిషనర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. హామీల అమలు కోసం జిల్లాలోని ఐటీడీఏ పీవో, డీటీడీవో, కలెక్టర్ ఆఫీసుల ఎదుట ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ధర్నాలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎస్రమ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, డైలీ వేజ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు టేకం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బి.మధు, నేతలు సురేందర్, మంగమ్మ, తార్యా, బ్రహ్మచారి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.