- టెండర్ల జాప్యంతో ఆసక్తి చూపని గిరిజనులు
- అకాల వర్షాలతో నాణ్యతపై కూలీల్లో ఆందోళన
- రాష్ట్రంలో 434 యూనిట్ల పరిధిలో తునికాకు సేకరణ
వేసవి కాలంలో అడవిపై ఆధారపడి జీవించే వేలాది గిరిజన కుటుంబాలకు తునికాకు సేకరణ ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. ఈసారి ప్రభుత్వం ధర పెంచినా, టెండర్ల ప్రక్రియలో జాప్యం, మండిపోతున్న ఎండలు, అకాల వర్షాల ముప్పుతో తునికాకు సీజన్‌పై ప్రభావం పడింది. సకాలంలో సేకరణ ప్రారంభం కాకపోతే కూలీల ఉపాధితో పాటు ప్రభుత్వ ఆదాయానికీ భారీ దెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
హైదరాబాద్, వెలుగు: అడవి బిడ్డల ప్రధాన జీవనాధారమైన తునికాకు సేకరణపై ఈసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం ధర పెంచినా సేకరణలో వేగం పెరగడం లేదు. ఓ వైపు ఎండలు మండిపోతుండటం, మరోవైపు వర్షాకాలం ముంచుకొస్తుండటంతో ఈ ఏడాది ఆకు సేకరణ సజావుగా సాగుతుందా.. లేదా? అన్న సందిగ్ధంలో కూలీలు ఉన్నారు. టెండర్ల ప్రక్రియలో జాప్యం జరగడం కూలీల పాలిట శాపంగా మారుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తునికాకు సేకరణ ధరను పెంచింది. గతేడాది కట్ట(50 ఆకులు)కు రూ.3.10 పైసలు చెల్లించగా.. ఈ సారి దానిని రూ.3.40 పైసలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కట్టకు రూ.30 పైసలు పెంచారు. వేలాది కుటుంబాలకు వేసవిలో ఇదే ప్రధాన ఉపాధి మార్గం. అయితే ధర పెరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో సేకరణ ఇంకా ఊపందుకోలేదు.
ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల మొదటి వారం నుంచే తునికాకు సేకరణ చేపట్టాల్సి ఉండగా, ఈసారి పలు యూనిట్లకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, సాంకేతిక కారణాల వల్ల టెండర్ల ప్రక్రియపై స్తబ్ధత నెలకొంది.
వెదర్ చేంజ్‌తో కూలీల్లో ఆందోళన..
జూన్ నెల సమీపిస్తుండటంతో వాతావరణంలో మార్పులొస్తున్నాయి. రోహిణి కార్తె ఎండలు ముదురుతుండటం, అక్కడక్కడా అకాల వర్షాలు కురుస్తుండటంతో ఆకు నాణ్యత దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కూలీలు చెప్తున్నారు. ఒక్కసారి వర్షం పడితే ఆకుపై మచ్చలు పడి, అది బీడీల తయారీకి పనికిరాకుండా పోతుందని అంటున్నారు. అప్పుడు కాంట్రాక్టర్లు ఆకును కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపబోరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి ఏటా రూ.200 కోట్ల ఆదాయం..
రాష్ట్రవ్యాప్తంగా అటవీ శాఖ తునికాకు సేకరణను యూనిట్ల వారీగా విభజిస్తుంది. రాష్ట్రంలో సుమారు 434 తునికాకు యూనిట్లు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్ పరిధిలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లోని అటవీ రేంజ్‌లలో అత్యధికంగా సేకరణ జరుగుతుంది. దాదాపు 20కి పైగా అటవీ డివిజన్ల పరిధిలో ఈ ప్రక్రియ కొనసాగనున్నది.
తునికాకు ద్వారా వచ్చే ఆదాయం ప్రధానంగా ఆక్షన్(వేలం) మీద ఆధారపడి ఉంటుంది. ఏటా తునికాకు అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది.
గతేడాది సుమారు రూ. 200 కోట్లకు పైగా టర్నోవర్ జరిగింది. ఏటా రాష్ట్రంలో 2 లక్షల నుంచి 3 లక్షల స్టాండర్డ్ బ్యాగుల సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వర్షాలు రాకముందే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, వెంటనే సేకరణ ప్రారంభించాలని కూలీలు కోరుతున్నారు.
