
- టీ20 వరల్డ్ కప్ టీమ్ కాంబినేషన్‌పై సెలెక్టర్ల ముందు చిక్కు ప్రశ్నలు!
న్యూఢిల్లీ: ఇండియా టీమ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ స్థానం ప్రశ్నార్థకంగా మారడం.. ఓ ఏడాది కిందట ఊహకు కూడా అందని విషయం. కానీ ఇప్పుడు.. అతను తుది జట్టులో ఉంటాడా? లేదా? అన్న అంశం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నది. గత దశాబ్ద కాలంలో ఫైనల్ ఎలెవన్‌లో విరాట్ లేకుండా ఆడిన మ్యాచ్‌లే లేవు. కానీ ఇప్పుడు.. అతన్ని తీసుకుంటే మిడిలార్డర్‌లో ఎవరిపై వేటు వేయాలనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. టీ20 వరల్డ్‌కప్‌కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో... టీమ్ సమీకరణాల్లో సెలెక్టర్లు ఎలాంటి మార్పులు చేయబోతున్నారు. అవి ఎవరిపై ప్రభావం చూపిస్తాయనేది ఉత్కంఠగా మారింది.
టీమ్‌లో చోటుకు తీవ్రమైన పోటీ..
గతేడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ పరాజయాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి టోర్నీ కోసం బీసీసీఐ భారీ ప్లాన్స్ వేస్తోంది. బలమైన జట్టును బరిలోకి దించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అందులో భాగంగా కుర్రాళ్లతో చేసిన ప్రతి ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు టీమ్‌లో చోటు కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. షార్ట్ ఫార్మాట్‌లో టాప్–3లో రోహిత్, రాహుల్, కోహ్లీ కామన్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు రాహుల్‌తో పాటు విరాట్ ఫామ్‌లో లేడు.
మరి ఈ క్లిష్ట సమయంలో ఈ ఇద్దర్ని తప్పించే ధైర్యం సెలెక్షన్ కమిటీ చేస్తుందా? ఒకవేళ ఈ ఇద్దర్ని కొనసాగిస్తే మిడిలార్డర్‌లో ఎవరిపై వేటు వేస్తారన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం రిషబ్ పంత్, సూర్యకుమార్, దినేశ్ కార్తీక్‌తో మిడిలార్డర్ చాలా బలంగా ఉంది. టీమిండియాకు పంత్ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది కాదనలేని నిజం. సూర్య 360 డిగ్రీస్ హిట్టర్. కార్తీక్ సూపర్ ఫినిషర్. ఐపీఎల్‌తో పాటు ఇటీవల ఆడిన సిరీస్‌ల్లో వీళ్లు తమ సత్తాను నిరూపించుకున్నారు.
మరి రాహుల్, విరాట్‌ను కొనసాగించాల్సి వస్తే ఈ ముగ్గురిలో ఎవర్ని తొలగిస్తారు? దీనికి కచ్చితమైన సమాధానం సెలెక్షన్ కమిటీ వద్ద ఉందా? అన్నది తేలాలి. ఆల్‌రౌండర్లుగా హార్దిక్, జడేజా ప్లేస్‌లు ఖాయం. వీళ్లపై ఎలాంటి చర్చ అవసరం లేదు. లైనప్‌లో కనీసం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు అవసరం కాబట్టి.. ఈ ఇద్దర్ని తీసే చాన్స్ లేదు. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్ల ఎంపికనే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
విరాట్ ఫామ్‌లోకి వస్తాడా?
గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత.. 9 నెలల్లో కోహ్లీ 4 టీ20 మ్యాచ్‌లే ఆడాడు. అందులో 17, 52, 1, 11 స్కోర్లు మాత్రమే చేశాడు. కోహ్లీ స్థాయికి ఇవి చాలా తక్కువ స్కోర్లు. దాంతో, రాబోయే ఆసియా కప్‌లో అతని పెర్ఫామెన్స్‌పై అందరి ఫోకస్ ఉన్నది. నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టే విరాట్ క్రీజులో కుదురుకోగానే వికెట్ పారేసుకుంటున్నాడు. మరోవైపు ఈ ఫార్మాట్‌లో ఇండియా మొదటి బాల్ నుంచే ఎదురుదాడి చేస్తోంది.
ఈ పంథాలో ఆడి ఇంగ్లండ్, విండీస్‌లో సక్సెస్ కూడా అయ్యింది. కాబట్టి కోహ్లీ తనలోని చాంపియన్ బ్యాటర్‌ను తక్షణమే నిద్రలేపాల్సి ఉంటుంది. ఇప్పటికే అతని కోసం నిలకడగా ఆడుతున్న ప్లేయర్లను తప్పించాల్సి వస్తోంది. ఆసియాకప్‌లోనూ ఫెయిలైతే మాత్రం కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌నకు దూరమైనా ఆశ్చర్యం లేదు.