హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన నిరుద్యోగ యువతకు అత్యాధునిక రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో–-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ట్రైకార్) సిద్ధమైంది. ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్నానూరు ఐటీడీఏల పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువకులకు శిక్షణ ఇవ్వనుంది. ఐటీడీఏ పరిధిలో 2,700 మంది చొప్పున 8,100 మందికి, మైదాన ప్రాంతాల్లో 2,400 మందికి శిక్షణ అందించనున్నారు.
ఆర్గానిక్ ఫార్మింగ్, బ్యూటీ థెరపిస్ట్, చెఫ్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, సోలార్ పంప్ టెక్నీషియన్, డ్రోన్ పైలటింగ్–రిపేరింగ్, ఈవీ– సోలార్ ప్యానెల్ ఇన్‌స్టాలేషన్, మల్టీ స్కిల్ టెక్నీషియన్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ తదితర కోర్సులు ఇందులో ఉన్నాయి. 20 నుంచి 100 రోజుల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తిగల వారు ఈనెల 24 నుంచి తమ ఐటీడీఏ పీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తులు పరిశీలించి వచ్చే నెల నుంచి బ్యాచ్‌లు ప్రారంభిస్తారు.

