వివాదాల చినజీయర్!.. చినజీయర్ పై మండి పడుతున్న స్మార్తులు, శైవ క్షేత్రాలు, పీఠాల అధిపతులు

వివాదాల చినజీయర్!.. చినజీయర్ పై మండి పడుతున్న స్మార్తులు, శైవ క్షేత్రాలు, పీఠాల అధిపతులు
  • సమ్మక్క- సార‌ల‌మ్మ  నుంచి శంకరాచార్యుల దాకా.. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు
  •     తాజాగా శంకరాచార్యులు కూడా వైష్ణవుడేనని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు: త్రిదండి చినజీయర్ స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దుమారం రేపారు. గతంలో సమ్మక్క-సారక్కలపై ఇష్టారీతిన మాట్లాడిన ఆయన.. తాజాగా హిందూ ధర్మానికి మూలస్తంభమైన ఆదిశంకరాచార్యుల మీద చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చతురామ్నాయ పీఠాలను స్థాపించింది శంకరాచార్యులు కాదంటూ చేసిన కామెంట్లపై స్మార్త పండితులు, శైవ క్షేత్రాల నిర్వాహకులు, పీఠాధిపతులు భగ్గుమంటున్నారు.

ఆదిశంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ 'భజ గోవిందం'లోని ‘నహి నహి రక్షతి డుకృణ్ కరణే (వ్యాకరణ సూత్రాలు మరణ సమయంలో నిన్ను రక్షించవు, గోవిందుడిని భజించు)’ అనే శ్లోకంపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "శంకరాచార్యులకు గ్రామర్ రాదు. 

పాణిని వ్యాకరణం ఆయనకు మింగుడు పడలేదు. ఆయనకు తోచింది రాసుకున్నారు" అన్న రీతిలో జీయర్ స్వామి మాట్లాడటం పండిత లోకాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రస్థాన త్రయానికి భాష్యం చెప్పిన, కాశీ పండితులనే మెప్పించిన మహాజ్ఞాని పాండిత్యాన్నే శంకించే స్థాయికి జీయర్ వెళ్లారా? అని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. 

నాడు సమ్మక్క.. నేడు శంకరాచార్యులు

గతంలో మేడారం జాతర సమయంలోనూ.. "సమ్మక్క సారక్క ఎవరు? వాళ్లు బ్రహ్మ లోకం నుంచి దిగి వచ్చారా? అడవి దేవతలు.. వాళ్లకొక స్థలమా?" అంటూ చినజీయర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని ఆగ్రహానికి గురిచేశాయి. అప్పట్లో ఆదివాసీ సంఘాలు, తెలంగాణవాదులు ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఆ వివాదం మరవకముందే.. ఇప్పుడు హిందూ ధర్మంలోని మరో వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం వెనుక జీయర్ ఆంతర్యం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘‘దేశంలో చతురామ్నాయ పీఠాలను (పూరీ, ద్వారక, బదరి, శృంగేరి) స్థాపించింది శంకరాచార్యులు కాదు. ఆయన హిమాలయాలకు వెళ్లి తిరిగి రాలేదు. ఆ పీఠాలను స్థాపించింది13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి గైడ్‌గా ఉన్న విద్యారణ్య స్వామి. 

పంచాయతన పూజా విధానాన్ని తెచ్చింది ఆయనే’’ అంటూ జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. అయితే, చరిత్ర ప్రకారం విద్యారణ్య స్వామి శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపతిగా(1380=-1386) మాత్రమే వ్యవహరించారని, ఆయన కంటే ముందు 11 మంది పీఠాధిపతులు ఉన్నారని చరిత్రకారులు, పండితులు గుర్తు చేస్తున్నారు.  

విష్ణువే సుప్రీం గాడ్.. 

శివుడి విషయంలోనూ జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు శైవ భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. "నారాయణుడే పరమాత్మ. శివుడు, బ్రహ్మ ఆయనకు లోబడి ఉండేవారే. శివుడిని ఆరాధించడం అంటే.. ముఖ్యమంత్రిని కాకుండా ప్యూన్‌ని బతిమిలాడుకున్నట్టే" అనే అర్థం వచ్చేలా ఆయన చేసిన ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. 

శంకరాచార్యులు కూడా శుద్ధ వైష్ణవుడేనని, మొహమాటం కొద్దీ ఇతర దేవుళ్ల పేర్లు చెప్పారని జీయర్ అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హరిహరులు ఒక్కటే అని పురాణాలు చెబుతుంటే.. ఇలా దేవుళ్ల మధ్య తరతమ భేదాలు సృష్టించడం తగదని పండితులు హితవు పలుకుతున్నారు. శివాలయాలకు వెళ్తే తిరిగి స్నానం చేయాలి అన్నట్టుగా గతంలో ఆయన చేసిన ప్రచారాన్ని కూడా నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.

క్షమాపణ చెప్పాల్సిందే: పీఠాధిపతుల డిమాండ్ 

చినజీయర్ వ్యాఖ్యలను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షులు కమలానంద భారతి తదితరులు తీవ్రంగా ఖండించారు. "ఆది శంకరాచార్యులు లేకపోతే ఈరోజు హిందూ ధర్మమే ఉండేది కాదు. అలాంటి మహానుభావుడిపై విమర్శలు అజ్ఞానానికి పరాకాష్ట అని పేర్కొంటున్నారు. సమతా మూర్తి సాక్షిగా.. అసమతను పెంచుతున్నార‌ని మండిప‌డుతున్నారు. 

భజ గోవిందం సారాంశం తెలియకుండా గ్రామర్ గురించి మాట్లాడటం విడ్డూరమ‌ని పేర్కొంటున్నారు. చినజీయర్ స్వామి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని బ్రాహ్మణ సంఘాలు, శైవ పీఠాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో ముచ్చింతల్ ఆశ్రమాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి.