మహువాపై అనర్హత వేటుకు రంగం సిద్ధం!.. తర్వాత ఆమె స్టెప్ ఏంటి..?

మహువాపై అనర్హత వేటుకు రంగం సిద్ధం!..  తర్వాత ఆమె స్టెప్ ఏంటి..?

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడనుందా..? ఆమె లోక్ సభ సభ్యత్వం రద్దవుతుందా..? ఒకవేళ ఆమెపై అనర్హత వేటు వేస్తే.. ఆ తర్వాత ఆమె అడుగులు ఎటువైపు..? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. 

డబ్బులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారంటూ ఎంపీ మహువా మొయిత్రా రాజకీయంగా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై అనర్హత వేటుపడే అవకాశం కనిపిస్తోంది. నైతిక విలువల కమిటీ లోక్‌సభకు ఈ నివేదికను సమర్పించిన తర్వాత మొయిత్రాపై అనర్హత వేటు వేయాలని కేంద్రం కోరనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో 4వ తేదీన నైతిక విలువల కమిటీ.. ఆ నివేదికను లోక్‌సభ ముందు ఉంచనుందని తెలుస్తోంది. 

లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ విచారణ జరిపింది. కమిటీ నివేదికను పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోన్కర్‌ నేతృత్వంలోని ఈ కమిటీ సమావేశమైంది. ఆ తర్వాత దానిని 6:4 మెజారిటీతో ఆమోదించింది.

మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని ఎథిక్స్ కమిటీ చెప్పింది. అందుకే ఆమెను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సమావేశాల్లో దానిని ప్రవేశపెట్టి చర్చ జరిపే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆమెపై అనర్హత వేటు వేయాలని కేంద్రం కోరనుందని తెలుస్తోంది.