బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్​

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్​
  • బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి సూసైడ్​
  • హాస్టల్​లో ఫ్యాన్​కు ఉరేసుకుని మృతి
  • వ్యక్తిగత కారణాలతోనే ఉరేసుకున్నాడన్న ఎస్పీ 
  • మృతుడికి ఇబ్బందులేమీ లేవన్న ఫ్రెండ్స్ 
  • క్యాంపస్ ఆసుపత్రిలో సౌలతుల్లేకనే మృతి చెందినట్లు ఆరోపణలు 
  • వర్సిటీ గేటు వద్ద విద్యార్థుల మౌనదీక్ష 
  • ఇయ్యాల విద్యాసంస్థల బంద్ కు పిలుపు 
  • మోహరించిన పోలీసులు    

భైంసా / నిర్మల్ / బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్​ఐటీ క్యాంపస్​లో మరో దారుణం జరిగింది. ట్రిపుల్ ఐటీలో సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి తండాకు చెందిన రాథోడ్ సురేశ్(18) అనే స్టూడెంట్ హాస్టల్​రూంలో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. మంగళవారం మధ్యాహ్నం టైంలో తాము హాస్టల్ రూంకు వెళ్లగా.. సురేశ్ ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించాడని తోటి స్టూడెంట్లు వెల్లడించారు. వర్సిటీ ఆఫీసర్లకు విషయం చెప్పినా గంటన్నర దాకా ఎవరూ రాలేదని, క్యాంపస్ లో అంబులెన్స్ కూడా లేదన్నారు. 

ఆలస్యంగా సమాచారం తెలుసుకున్న పోలీసులు హాస్టల్​కు చేరుకుని సురేశ్ ను క్యాంపస్​లోని హాస్పిటల్​కు తరలించారు. అక్కడి నుంచి భైంసా హాస్పిటల్ కు, ఆ తర్వాత నిర్మల్ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అయితే, క్యాంపస్ ఆసుపత్రిలో సరైన సౌలతులు, మందులు అందుబాటులో ఉంటే సురేశ్ బతికేవాడని స్టూడెంట్లు అంటున్నారు. ఆసపత్రిలో సౌలతులు కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ1, ఈ2, ఈ4 స్టూడెంట్లు మౌనదీక్ష చేపట్టారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పాటించాలని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. క్యాంపస్ లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 

సొంత తండాకు డెడ్ బాడీ తరలింపు  

సురేశ్ మృతితో నిర్మల్ జిల్లా ఆసుపత్రి వద్ద కూడా ఉద్రిక్తత ఏర్పడింది. మృతుడి తండ్రి గంగారాం రాథోడ్, పెద్దనాన్న గణేశ్, బంధువులు నిర్మల్ ఆసుపత్రి వద్దకు చేరుకోగా.. సురేశ్ డెడ్ బాడీని చూసేందుకు పోలీసులు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రమాదేవి, లీడర్లు మెడిసెమ్మ రాజు, రాజేశ్వర్ రెడ్డి, కమల్​నయన్ తో పాటు కాంగ్రెస్​లీడర్లు నాందేడపు చిన్ను, సూరి, తదితరులు కూడా అక్కడికి చేరుకోగా, పోలీసులు ఆసుపత్రిలోకి పోకుండా అడ్డుకున్నారు. ఆసుపత్రి వద్ద దాదాపు మూడు గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు అక్కడే సురేశ్ డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా, వారు డిచ్ పల్లికి తీసుకెళ్లారు. 

ఇది సర్కారు హత్యే: ఎంపీ సోయం 

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సురేశ్ ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఎంపీ సోయం బాపూరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కొంతకాలంగా ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చదువులు మానేసి హాస్పిటల్ పాలవుతున్నారని, ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. ట్రిపుల్ ఐటీలో పోలీసుల నిర్బంధం మధ్య విద్యార్థులను అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్రపన్ని, వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. మంత్రులు కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, ఈ ఘటనలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  

ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం

సురేశ్ మృతికి ట్రీపుల్​ఐటీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని అతని తండ్రి గంగారాం రాథోడ్ ఆరోపించారు. తన కొడుకుకు ఎలాంటి వ్యక్తిగత ఇబ్బందులు లేవని, తమకు ఆర్థిక సమస్యలు కూడా లేవన్నారు. చదువులోనూ సురేశ్ ముందుండేవాడని చెప్పారు. సురేశ్ ను క్యాంపస్ నుంచి భైంసాకు, అక్కడి నుంచి నిర్మల్ కు తరలించారని, ఉరి వేసుకున్నట్లు, ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. హాస్టల్ రూంలో సూసైడ్ నోట్ కూడా ఉన్నట్లు తెలిసిందని, దానిని పోలీసులు, అధికారులు ఎక్కడ దాచారని నిలదీశారు. సురేశ్ మృతిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

 
- సురేశ్ తండ్రి గంగారాం