- ఐదో విడతలో వంద మందికి రూ. 5.30 కోట్లు
- తుర్కపల్లి, చౌటుప్పల్ 'కాలా' పరిధిలో పేమెంట్స్
- ఇప్పటివరకూ 815 అకౌంట్లలో రూ. 79.87 కోట్లు
యాదాద్రి, వెలుగు: ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు విడతల వారీగా పరిహారం అందుతోంది. గడిచిన నాలుగు నెలల్లో నాలుగు విడతల్లో పరిహారం అందించగా , తాజాగా మరో వంద మందికి పరిహారం ఇవ్వడానికి ప్రాసెస్ రెడీ అయింది. భారత్ మాల పరియోజనలో భాగంగా యాదాద్రి జిల్లాలో ట్రిపుల్ఆర్ఉత్తర భాగం నిర్మాణం కానున్న సంగతి తెలిసిందే.
భూసేకరణ నోటిఫికేషన్‌ను 2022లో జారీ చేశారు. జిల్లాలోని ఐదు మండలల్లోని 24 గ్రామాల మీదుగా 59.33 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రోడ్డుకు మొత్తంగా 1795 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దీని కోసం జిల్లాలో తుర్కపల్లి, భువనగిరి, చౌటుప్పల్ ‘కాలా’ కాంపిటెంట్ అథారిటీ ల్యాండ్ అక్విషన్ లను ఏర్పాటు చేసి, వీటికి అడిషనల్ కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు.
తుర్కపల్లిలో 311 ఎకరాలకు ..
తుర్కపల్లి ‘కాలా’ పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూ సర్వేతో పాటు బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్టక్చర్ఎంక్వైరీ ముగిసింది. ఈ పరిధిలో మొత్తంగా 510.38 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 268 ఎకరాలకు పరిహారం అందగా తాజాగా 42 ఎకరాలకు పంబంధించి వందమంది వివరాలను భూమి రాశి పోర్టల్లో అప్లోడ్ చేశారు.
పోర్టల్లో అప్లోడ్ అయిన డిటైల్స్‌ను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పీడీ, జీఎం వేర్వేరుగా పరిశీలించారు. వీరి ఖాతాల్లో రూ. 5.30 కోట్లు పరిహారం ఒకటి రెండ్రోజుల్లో జమ కానుంది. సర్వే పూర్తయిన తుర్కపల్లి కాలా పరిధిలో ఇప్పటివరకూ 647 అకౌంట్లలో విడతల వారీగా పరిహారం జమ చేసింది.
చౌటుప్పల్‌లో 80 ఎకరాలకు
చౌటుప్పల్ కాలా పరిధిలో 795 ఎకరాల వరకూ సేకరించాల్సి ఉంది. ఈ కాలా పరిధిలోని రెడ్లరేపాక, పహిల్వాన్‌పురం, చౌటుప్పల్ పరిధిలోని 80 ఎకరాలకు సంబంధించిన 140 అకౌంట్లలో రూ. 22 కోట్లు పరిహారం జమ చేశారు. చౌటుప్పల్ పరిధిలో కొంతమేర జరగగా భువనగిరి ‘కాలా’ పరిధిలోని రైతులు తమ భూములు ఇవ్వడానికి ఒప్పుకోకుండా ఆందోళనలు నిర్వహించి సర్వేను అడ్టుకోవడంతో ఆగిపోయింది.
