సూర్య, త్రిష జంటగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘కరుప్పు’ మే 14న విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం త్రిష పోషిస్తున్న ప్రీతి పాత్రను పరిచయం చేస్తూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె లాయర్ గెటప్‌తో పాటు చీరకట్టులో ఆకట్టుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సూర్య, త్రిష తిరిగి నటిస్తుండటంతో అంచనాలు నెలకొన్నాయి.
అయితే సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న వేళ హీరోయిన్ త్రిషకు, చిత్ర యూనిట్‌కు మధ్య విభేదాలు బయటపడటం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ‘ఈ సినిమాలో నేను నటించాననే విషయాన్నే మర్చిపోయాను.. వీడియో రిలీజ్ చేసి గుర్తు చేసినందుకు సంతోషం’ అంటూ మేకర్స్‌పై త్రిష సెటైర్లు వేశారు.
అలాగే ఆడియో ఫంక్షన్‌కు ఎందుకు వెళ్లలేదని నెటిజన్లు ప్రశ్నించగా, ‘నన్ను ఆహ్వానిస్తూ మేకర్స్ పంపిన మెయిల్ మిస్ అయినట్టుంది’ అంటూ తనను ఆహ్వానించలేదనే విషయాన్ని వ్యంగ్యంగా చెప్పింది. ఇటీవల మధురైలో జరిగిన ఆడియో ఈవెంట్‌లో టీమ్ ఎవరూ కనీసం త్రిష పేరును ప్రస్తావించలేదు. దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ, తనతో త్రిష రిలేషన్ ప్రభావం తమ సినిమాపై పడకుండా మేకర్స్ ఇలా ఆమెను ప్రమోషన్స్‌కు దూరం పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
