షర్మిలను అడ్డం పెట్టుకుని మళ్లీ గెలవాలని చూస్తున్నారు

షర్మిలను అడ్డం పెట్టుకుని మళ్లీ గెలవాలని చూస్తున్నారు

వచ్చే ఎన్నికల్లో షర్మిలను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ నేతలు మళ్లీ గెలవాలని చూస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ రైతులు పసుపు బోర్డే కావాలంటే కేంద్రంతో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. ‘స్పైసెస్ రీజనల్ ఎక్స్‌టెన్షన్ బోర్డ్‌తో పసుపుకు మంచి ధర వస్తుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, షర్మిళ పార్టీ అన్నీ కలిసి లోపాయకారి ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయి. కవితను ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్‌లో పసుపు బోర్డు అంశం లేవనెత్తారు. రాజశేఖర్ రెడ్డి పసుపు బోర్డును ఎందుకు తేలేదు. ఆయన కనీసం దీనిపై ఎప్పడైనా స్పందించారా? డీఎస్ చెప్పినా వైఎస్ వినలేదు. ఈ విషయం షర్మిలకు తెలియదా? షర్మిళ సభకు అనుమతి ఇచ్చినందుకు కవితకు సాయం చేసేందుకే షర్మిళ పసుపు బోర్డు అంటోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు టీఆర్ఎస్‌ను ఆయన ఎప్పుడూ విమర్శించలేదని కాంగ్రెస్ నేతలే ఆరోపించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలలో చిన్నారెడ్డి, రాములు నాయక్‌లను బలిపశువులను చేశారు. టీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు కాంగ్రెస్‌ను గెలిపించేలా ఉన్నాయి. పీవీ కూతురును అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ కూతురు షర్మిలను అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నారు’ అని ఆయన అన్నారు.