
- బేగంపేట నుంచి జలవిహార్ కు 10 వేల బైకులతో భారీ ర్యాలీ
- సభలో ప్రసంగించనున్న కేసీఆర్
హైదరాబాద్ వెలుగు: ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ లోని జలవిహార్ లో శనివారం టీఆర్ ఎస్ పార్టీ పరిచయ సభను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని.. సిన్హాను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యే లు. నేతలకు పరిచయం చేయనున్నారు. ఇప్పటికే యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ పంజా గుట్ట, రాజ్ భవన్, నెక్లెస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. 'మీ సపోర్ట్ యశ్వంత్ సిన్హాజీ' అంటూ రాసి, కేసీఆర్, సిన్హా ఫొటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 11గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకో నున్న యశ్వంత్ సిన్హా దగ్గరకు సీఎం కేసీఆర్, మంత్రులు వెల్లి ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి సుమారు 10వేల బైక్ లతో ర్యాలీగా బయల్దేరుతారు.
సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్‌భవన్ మీదుగా నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌కు చేరుకుంటారు. జలవిహార్‌లో జరిగే సిన్హా పరిచయ సభకు టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, స్టేట్ కార్పొరేషన్ చైర్పర్సన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆహ్వానించారు. యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది.. కేంద్రంలోని బీజేపీ విధానాలు ఎలా ఉన్నాయి అనే దానిపై సభలో కేసీఆర్ మాట్లాడుతారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. హైదరాబాద్‌లోనే బీజేపీ సమావేశాలు నిర్వహిస్తున్నందున ఆ పార్టీని ఎండగట్టడానికి ఇదే వేదికను కేసీఆర్ ఉపయోగించుకుంటారని వారు అంటున్నారు.
బీజేపీ వాళ్లు పొలిటికల్ టూరిస్టులు: తలసాని
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పొలిటికల్ టూరిస్టులని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. యశ్వంత్ సిన్హా ప్రచార సభ నిర్వహించే జలవిహార్‌లో ఏర్పాట్లను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, మంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. బీజేపీ సమావేశాలకు వస్తున్న పొలిటికల్ టూరిస్టులు ఇక్కడి అభివృద్ధిని చూసి తరించాలన్నారు.
యశ్వంత్ సిన్హాకు భారీ ఫ్లెక్సీలతో స్వాగతం
ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్, యశ్వంత్ సిన్హా ఫొటోలతో వీటిని ముద్రించి.. ‘వీ సపోర్టు యశ్వంత్ సిన్హాజీ’ అని రాసి.. సిటీలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉంచింది. రాజ్‌భవన్ రోడ్డు, పంజాగుట్ట, నెక్లెస్ రోడ్డు వంటి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఈ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ సభ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోగా.. అందుకు పోటీగా ముందస్తుగానే సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ నేతలు శుక్రవారం వాటికి తోడు యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు పెట్టారు. కొన్ని చోట్ల బీజేపీ ఫ్లెక్సీలు కనపడకుండా టీఆర్ ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. పలు చోట్ల ఇరు పార్టీ
కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ నిరసనలు
ఇందిరా గాంధీ విగ్రహాలకు టీఆర్ఎస్, బీజేపీ జెండాలు కట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఇందిరా గాంధీ విగ్రహం చుట్టూ ఉన్న టీఆర్ఎస్, బీజేపీ జెండాలను యూత్ కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ ఆధ్వర్యంలో తొలగించారు