
భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో సోమవారం అర్ధరాత్రి సమయంలో టీఆర్‍ఎస్‍నేత, మాజీ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ పరిధిలోని బెస్తకొత్తూరులోని శ్రీనివాసరావు ఇంట్లోకి ప్రవేశించిన సాయుధులైన నక్సల్స్ మాట్లాడే పని ఉందంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతని కుమారుడు ప్రవీణ్‍కుమార్, భార్య దుర్గలు నక్సల్స్‌ను అడ్డుకొని వదిలేయాలంటూ ప్రాధేయపడ్డారు. వారిద్దర్ని కూడా కొట్టి తమ వెంట తీసుకెళ్లారు. ప్రవీణ్‍కుమార్ తలకు గాయాలయ్యాయి.
శ్రీనివాసరావు రైతులకు వడ్డీలకు అప్పులిస్తున్నారని.. తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో గిరిజనుల భూమిని సాగు చేస్తున్నారని.. ఈ విషయంపై మావోయిస్టులు అతన్ని పలుమార్లు హెచ్చరించినట్లుగా సమాచారం. తను ఇవేవి పట్టించుకోకపోవడంతోనే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం కొందరు గ్రామస్థులు ఐదు ట్రాక్టర్లలో శ్రీనివాసరావును వెతికేందుకు సమీప అడవుల్లోకి వెళ్లారు. వారు తిరిగొచ్చేంత వరకు ఎటువంటి సమాచారం తెలియని పరిస్థితి. ఈ కిడ్నాప్‌తో భద్రాచలం ఏజెన్సీలోని అధికార పార్టీ నాయకులు పలువురు గ్రామాలు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. పోలీసులు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.