
పరిషత్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలకు నిరసనల కాక తగిలింది. ‘ఇప్పటివరకు ఏం చేశావ్’ అని నిర్మొహమాటంగా నాయకులను ప్రజలు నిలదీశారు. ఇచ్చిన హామీల అమలేది?, సమస్యలకు పరిష్కారాలేవని కడిగేశారు. ‘ప్రచారానికి మా ఊళ్లోకే రావొద్ద’ని అడుగడుగునా అడ్డుకున్నారు. తొలి విడతలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పరిమితమైన హీట్ తుది విడతకు అందరికీ పాకింది. ప్రజల ప్రశ్నలకు మంత్రి స్థాయి నేతలు సైతం సంయమనం కోల్పోయి నోరు జారిన సందర్భాలున్నాయి. తమకు ఓటేయకుంటే అభివృద్ధి కాదని బెదిరించిన దాఖలాలున్నాయి.
కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్సోళ్లను గెలిపించమంటవా?
పరిషత్ తుది విడత ప్రచారం ఆదివారంతో ముగిసింది. ఈ ఒక్క రోజే ముగ్గురు ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడ్డారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కట్టంగూరు మండలం నారెగూడెం గ్రామస్థులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఎందుకెళ్లావని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని ఎలా అడుగుతావని నిలదీశారు. రోడ్డుపై బైఠాయించి గ్రామంలో ప్రచారం చేయొద్దని అడ్డుకున్నారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి కూడా బాసర మండలంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓని గ్రామానికి ప్రచారానికి వెళ్లగా స్థానికేతరులకు టికెట్లు ఎలా ఇస్తావని ప్రజలు నిలదీశారు. ‘ఇక్కడ జడ్పీటీసీ టికెట్ ఇచ్చేందుకు అర్హులైన దళితులే లేరా?’ అని ప్రశ్నించారు. చేర్యాల మండలం ఆకునూరులో ప్రచారానికి వెళ్లిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికీ ప్రతిఘటన ఎదురైంది. ‘మల్లన్నసాగర్ పేరుతో అర్జునపట్ల, ఆకునూరు గ్రామాల్లో పెద్దవాగు నుంచి ఇసుక దోచేస్తున్నారు. దాన్ని ఆపండి. అప్పటివరకు ప్రచారం చేయొద్దు’ అని అడ్డు తగిలారు. ఇసుక తోడేస్తుండటంతో చేర్యాల, మద్దూరు, నంగునూరు, కోహెడ మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని మండిపడ్డారు. వారిని టీఆర్‌ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఫరీదుద్దీన్ తిట్ల వర్షం
రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోని హోతి (బి) గ్రామంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ను స్థానికులు నిలదీశారు. ‘ఓట్లున్నాయనే ఇప్పుడు నీళ్లు ఇస్తున్నారు. తర్వాత పట్టించుకునే వారే ఉండరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత గ్రామంలోనే తనను నిలదీయడంతో ఫరీదుద్దీన్ జీర్ణించుకోలేకపోయారు. సభా వేదిక నుంచే ప్రశ్నించిన వారిని తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్‌ఎస్‌కు ఎలా ప్రచారం చేస్తావని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో ప్రచారానికి వచ్చిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేశారు.
పార్టీ మారినోళ్లపై చీటింగ్ కేసులు
పార్టీ ఫిరాయించిన ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్‌రావు, కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ నాయక్, రేగా కాంతారావులపై కాంగ్రెస్ నాయకులు చీటింగ్ కేసులు పెట్టారు. టీఆర్‌ఎస్‌కు ఓటేయకుంటే అభివృద్ధి ఆగిపోతుందని, సంక్షేమ పథకాలు అందవని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలను బెదిరించడం, అభ్యర్థులు నచ్చకున్నా తనను చూసి ఓటేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా ప్రజలను అభ్యర్థించడం సంచలనంగా మారాయి. తిరుగుబాటు ఎదురవుతున్న సందర్భాల్లో కొందరు నేతలు ముఖం తిప్పుకొని వస్తుండగా, మరికొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు.