టీఆర్‌ఎస్‌ నేతలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నరు

టీఆర్‌ఎస్‌ నేతలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నరు

బీజేపీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి

హైదరాబాద్‌, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో 800 మంది లోకల్​ వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్రమే చెప్పిందని, కానీ వాటిని స్థానికులకు ఇవ్వకుండా టీఆర్‌ఎస్‌ నేతలు అమ్ముకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి ఆరోపించారు. ఆదివారం బీజేపీ స్టేట్‌ ఆఫీస్‌లో వారు మీడియాతో మాట్లాడారు. మోడీ సర్కారు రూ.6,120 కోట్లు ఖర్చు చేసి ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తోందని, ప్రారంభానికి రెడీ అవుతున్న ఫ్యాక్టరీని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మన్షుక్‌ మాండవీయలను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడాన్ని వారు తప్పుపట్టారు. మోడీ సర్కారుకు మంచి పేరు వస్తుందనే టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్ర మంత్రులను అడ్డుకున్నారని మండిపడ్డారు. కేంద్రం ఎన్‌టీపీసీ ద్వారా రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల విలువైన పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ మాటల ప్రభుత్వమని, బీజేపీ చేతల సర్కారు అని ప్రేమేందర్​రెడ్డి, శ్రుతి చెప్పారు.

కేసీఆర్‌ను దళితులు నమ్మొద్దు

రాష్ట్రంలోని దళితులు కేసీఆర్‌ను నమ్మొద్దని బీజేపీ నేతలు సూచించారు. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని, మూడెకరాల భూమి ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్నారని, దళితులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనులు మొదలు కాలేదని, ఎస్సీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించి మోసం చేశారని మండిపడ్డారు. గ్రామాల్లో దళితుల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములు గుంజుకుని డబుల్‌ బెడ్రూంలు నిర్మిస్తున్నారన్నారు. దళితులకు ఇన్ని రకాలుగా ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు.