దళితుడిపై తుపాకీతో దాడి చేసిన టీఆర్ఎస్ నేత కొడుకు

దళితుడిపై తుపాకీతో దాడి చేసిన టీఆర్ఎస్ నేత కొడుకు
  • దళితుడిపై నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కొడుకు దాడి
  • అడ్డం వచ్చిన గ్రామస్తులు, పోలీసులపైనా అటాక్​ 
  • సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఘటన

సూర్యాపేట/తుంగతుర్తి  వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ ​చైర్మన్‌ కొడుకు గణేశ్ ​ఓ దళితుడిపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అడ్డుకునేందుకు యత్నించిన గ్రామస్తులు, పోలీసులపైనా అటాక్​ చేయడంతో గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఈ ఘటన జరిగింది. తుంగతుర్తికి చెందిన భద్రయ్యయాదవ్ కు వెలుగుపల్లికి చెందిన శ్రీశైలంకు పాత కక్షలు ఉన్నాయి. దీంతో భద్రయ్య యాదవ్‌ తన బంధువైన ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్​చైర్మన్​ వట్టే జానయ్య యాదవ్ కొడుకు వట్టే గణేశ్ ను సంప్రదించాడు. దీంతో గణేశ్ ఆదివారం రాత్రి తన అనుచరులతో వచ్చి శ్రీశైలంపై దాడి చేశాడు. శ్రీశైలం తప్పించుకొని వెలుగుపల్లికే చెందిన మల్లెపాక వీరాంజనేయులుని లిఫ్ట్ అడిగాడు. అతడు శ్రీశైలంను తీసుకెళ్లి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. ఇది తెలుసుకున్న గణేశ్ వీరాంజనేయులు ఇంటిపైకి వచ్చాడు. అడ్డొచ్చిన వీరాంజనేయులు తల్లిదండ్రులను కొడుతుండడంతో గ్రామస్తులు వారించి పంపించారు. కాసేపటికి గణేశ్ మరికొంత మందికి కాల్ చేసి పిలిపించాడు. వీరంతా కలిసి వీరాంజనేయులు ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో గ్రామస్తులు ఎదురుదాడి చేశారు. దీంతో గణేశ్, అతని అనుచరులు గాయపడ్డారు.  సహనం కోల్పోయిన గణేశ్​ రివాల్వర్ తీసి బెదిరించాడు. తర్వాత అక్కడికి వచ్చిన పోలీసులపై కూడా దాడి చేయడంతో ఇద్దరు కానిస్టేబుల్స్​కు గాయాలయ్యాయి.  
దళిత సంఘాల ఆందోళన ..కేసు నమోదు
ఇంత రాద్దాంతం జరిగినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. గ్రామస్తులను సోమవారం సాయంత్రం వరకు పీఎస్​లోనే ఉంచుకుని పిటి షన్ తీసుకోలేదు. నిందితులను కూడా అదుపులోకి తీసుకోలేదు. గణేశ్​ దగ్గర రివాల్వర్​ లేదని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. దీంతో దళిత సంఘాల లీడర్లు పీఎస్​కు చేరుకుని ఆందోళన చేశారు. పోలీసుల స్పందించకపోవడంతో బైఠాయించారు. చివరకు మల్లె పాక ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు బయ్య భద్రయ్య, వేల్పుల రమేశ్, వట్టె గణేష్ లపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు.