
ప్రశ్న మాదే.. జవాబు మాదే
అసెంబ్లీలో టీఆర్ఎస్ డబుల్రోల్
వరుసబెట్టి నియోజకవర్గ సమస్యల ప్రస్తావన
పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదని అసంతృప్తి
గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఇదే పరిస్థితి అని కామెంట్లు
సమస్యలను నోట్ చేసుకుంటున్నామన్న మంత్రులు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష సభ్యుల్లా మారారు. పలువురు సభ్యులు వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసినంత పని చేశారు. నియోజకవర్గాల్లోని కొన్ని సమస్యలపై అసెంబ్లీ వేదికగా ఒకటికి రెండుసార్లు ప్రస్తావించినా పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను ప్రస్తావించే జీరో అవర్‌కు విలువ లేకుండా పోతోందని అన్నారు. తాము చెప్పిన అంశాలను పరిష్కరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కరించాలె
శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. ఒకే విషయాన్ని అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించినా ఫలితం ఉండడం లేదని చెప్పారు. కనీసం ఈసారైనా పరిష్కరించాలని కోరారు.
టీఆర్ఎస్ ఎమ్యెల్యేలు ప్రస్తావించిన సమస్యలను నోట్ చేసుకుంటున్నామని మంత్రులు చెప్పారు. అయితే నోట్ చేసుకోవడం కాకుండా పరిష్కరించేలా చూడాలని ఎమ్మెల్యేలు కోరారు. తాము చెప్పిన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘‘జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు ప్రస్తావించే విషయాలపై రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించా. అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే రెండు రోజుల ముందే సీఎస్ తోపాటు జీఏడీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్సెక్రటరీలకు ఆర్డర్స్ ఇచ్చా” అని ఎమ్మెల్యేలకు స్పీకర్పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలు
తన సొంత గ్రామం పేరు మార్పుపై గెజిట్నోటిఫికేషన్జారీ అంశాన్ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరోసారి సభలో ప్రస్తావించారు. దొంగల సింగారంగా ఉన్న తమ ఊరి పేరును 1996లో ప్రగతి సింగారంగా మార్చారని, ప్రభుత్వ గెజిట్‌లో మాత్రం ఇప్పటికీ పాత పేరే వస్తోందని అన్నారు. అసెంబ్లీలో దీనిపై గతంలోనూ పలుసార్లు చెప్పానని… ఈసారి అయినా పరిష్కరించాలని కోరారు.
ఏడు మండలాలు ఉన్న తన నియోజకవర్గంలో ఒక్కటే జూనియర్ కాలేజీ ఉందని, బాలికలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెప్పారు. అదనంగా రెండు కాలేజీలను మంజూరు చేయాని కోరారు. గతంలోనూ జీరో అవర్‌లో దీని గురించి కోరానని, కానీ చర్యలు తీసుకోలేదని చెప్పారు.
తన నియోజకవర్గంలోని హాలియా మండల కేంద్రానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చారని, దీన్ని అమలు చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కోరారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే నారాయణరెడ్డి కోరారు. రెగ్యులర్ సెంటర్ఏర్పాటు సాధ్యం కాకపోతే ఓపెన్ యూనివర్సిటీ పీజీ స్టడీ సెంటర్అయినా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అగ్రహారం డిగ్రీ కాలేజీలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు కోరారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలను, పీజీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ఎమ్మెల్యే బానోత్శంకర్నాయక్ కోరారు. అలాగే జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌ను 100 పడకల నుంచి 300 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.
తన నియోజకవర్గంలోని యూత్‌లో స్కిల్ డెవలప్‌మెంట్‌కు దోహదపడేందుకు సిరికొండ, దర్పల్లి మండలాల్లో ఐటీఐ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. నాలుగు రాష్ట్రాల రోడ్డు మార్గాలకు జంక్షన్‌గా ఉన్న జనగామలో మెడికల్ కాలేజీ ఇస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
బోథ్ నియోజకవర్గంలో 9 మండలాలు ఉంటే ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదని, బోథ్ లేదా ఇచ్చోడలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఆ సెగ్మెంట్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కోరారు.
ఉప్పల్ నియోజకవర్గంలో జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆ సెగ్మెంట్ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కోరారు.
తన నియోజకవర్గంలోని కొడిమ్యాల, గంగాధర మండల కేంద్రాల్లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. ప్రస్తుతం ఉన్న జూనియర్ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఆలంపూర్‌లో డాక్టర్లు, నర్సులు ఉండేందుకు బిల్డింగులు లేవని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వి.ఎం.అబ్రహం చెప్పారు. ప్రభుత్వం క్వార్టర్లను కడితే డాక్టర్లు, నర్సులు స్థానికంగా ఉండి ప్రజలకు వైద్యం చేసే అవకాశముందని అన్నారు. తన నియోజకవర్గంలోని ప్రజలు వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు వెళ్తారని, అక్కడి హాస్పిటల్స్ ను తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చాలని కోరారు.
మైనార్టీ గురుకులాల్లో సీట్లు మిగిలితే వాటిని నాన్ మైనార్టీలకు ఇవ్వాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని లోకల్పిల్లలకు స్థానిక గురుకులాల్లో 50 శాతం సీట్లు ఇచ్చిన తర్వాతే వేరే నియోజకవర్గాల వారికి అవకాశం ఇవ్వాలన్నారు.
మంచిర్యాల నియోజకవర్గానికి సాగునీరు ఇచ్చేందుకు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై లిఫ్ట్ ఏర్పాటు చేయాలని ఆ సెగ్మెంట్ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఉన్న గూడెం ఎత్తిపోతల సిస్టం పని చేయడంలేదని, దీని వల్ల సాగునీరు అందడంలేదని చెప్పారు.
బయ్యారం చెరువు కాలువలో పూడిక తీయాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియనాయక్ కోరారు.
పాకాల సరస్సు తూములకు మరమ్మతులు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.