టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పిన్రు

టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పిన్రు
  • అసెంబ్లీ జీరో అవర్​లో ఏకరువు
  • వేరే వేదిక లేకనే అసెంబ్లీలో లేవనెత్తామని ఆవేదన
  • నోట్​ చేసుకోవడం తప్ప పరిష్కారమేదని ఆగ్రహం

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ అసెంబ్లీ వేదికగా టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు గళమెత్తారు. ఈ సెషన్‌‌లో సోమవారం తొలిసారిగా ‘జీరో అవర్‌‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌‌ఎస్‌‌తో పాటు కాంగ్రెస్‌‌, ఎంఐఎం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి వేరే ఏ వేదికా లేకపోవడంతో జీరో అవర్‌‌ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్యేలు ఉపయోగించుకున్నారు. గతంలో జీరో అవర్‌‌లో ప్రస్తావించిన అంశాలను నోట్‌‌ చేసుకోవడం తప్ప.. వాటికి పరిష్కారం చూపించలేదని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌‌ పోచారం జోక్యం చేసుకుని జీరో అవర్‌‌లో ప్రస్తావించిన సమస్యలపై లిఖితపూర్వకంగా సమాధానాలివ్వాలని ఇప్పటికే సీఎస్‌‌కు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

పల్లె దవాఖానాలు పెట్టాలె
గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలు పెట్టాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. ఎన్‌‌టీపీసీ యాష్‌‌ పాండ్‌‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అక్కడి ప్రజలను వేరే ప్రాంతానికి తరలించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌ కోరారు. ఉక్రెయిన్‌‌ నుంచి తిరిగి వచ్చిన మెడికల్‌‌ స్టూడెంట్లకు ఇక్కడ చదువు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత విజ్ఞప్తి చేశారు. మరిపెడ మండల కేంద్రంలోని పీహెచ్‌‌సీని వంద పడకల హాస్పిటల్‌‌గా అప్‌‌గ్రేడ్‌‌ చేయాలని రెడ్యా నాయక్‌‌.. కాంట్రాక్టు బేసిస్‌‌లో పనిచేస్తున్న స్టాఫ్‌‌ నర్సులను రెగ్యులరైజ్‌‌ చేయాలని, వారికి రిటైర్మెంట్‌‌ బెనిఫిట్స్‌‌ ఇవ్వాలని గణేశ్‌‌గుప్త..  కరెంట్‌‌ కో ఆపరేటివ్‌‌ సంస్థ ‘సెస్‌‌ ’ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని చెన్నమనేని రమేశ్‌‌ కోరారు. కంటోన్మెంట్‌‌లో రోడ్లు ఓపెన్‌‌ చేయించాలని ఎమ్మెల్యే సాయన్న.. ఏజెన్సీలో గిరిజనులతో పాటు గిరిజనేతరులకు డబుల్‌‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే హరిప్రియా నాయక్‌‌ విజ్ఞప్తి చేశారు.

హాస్టళ్లు తెరిపించండి
సంక్షేమ హాస్టళ్లు తెరిపించి విద్యార్థులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌‌ ప్రభుత్వాన్ని కోరారు. కొత్తగా గ్రామ పంచాయతీలైన గిరిజన గూడాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ట్రైబల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌లో తమ నియోజవర్గాన్ని పైలెట్‌‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌‌యాదవ్‌‌ విజ్ఞప్తి చేశారు. బోథ్‌‌ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బాపురావు రాథోడ్‌‌ కోరారు. మొయినాబాద్‌‌, శంకర్‌‌పల్లిలో రైతులకు ఇచ్చిన అసైన్డ్‌‌ భూములు ఖాళీ చేయాలని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. జహీరాబాద్‌‌ - బీదర్‌‌ హైవేపై ఉన్న నారంగి చెరువును సుందరీకరించడంతో పాటు దానికి దిగువన 4 చెక్‌‌డ్యాంలు నిర్మించాలని జహీరాబాద్‌‌ ఎమ్మెల్యే మాణిక్‌‌రావు సూచించారు. మహిళా డిగ్రీ కాలేజీ లేక యువతులు ఇబ్బందులు పడుతున్నారని ఖానాపూర్‌‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌‌ సభ దృష్టికి తెచ్చారు. 

కొత్త కాలేజీలు ఇవ్వాలె
నాపరాయి గనుల మైనింగ్‌‌ లీజులు రెన్యూవల్‌‌ చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌‌ రోహిత్‌‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోచంపల్లికి పీహెచ్‌‌సీ ఇవ్వాలని, భువనగిరికి డయాలసిస్‌‌ సెంటర్‌‌ ఇవ్వాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌ రెడ్డి.. దేవరకద్రలో ఏడు మండలాలుంటే ఒక్క డిగ్రీ కాలేజీ లేదని, ఈ ఏడాదే రెండు డిగ్రీ కాలేజీలు ఇవ్వాలని ఆల వెంకటేశ్వర్‌‌ రెడ్డి కోరారు. పెద్దపల్లికి ఎస్సారెస్పీ నీళ్లు రావడం లేదని, వరద కాలువ తవ్వి తమ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌‌ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. వరంగల్‌‌లోని ఎస్‌‌ఆర్‌‌టీ, టీఆర్‌‌టీ లేబర్‌‌ కాలనీలో నివాసం ఉంటున్న కార్మికులకు ఇంటి స్థలాలపై హక్కులు కల్పించాలని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌‌ కోరారు. వాల్మీకిలను ఎస్టీల జాబితాలో చేర్చడంపై పలుమార్లు ప్రశ్నించినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌‌ రెడ్డి.. సత్తుపల్లి నియోజకవర్గానికి రెండు జూనియర్‌‌ కాలేజీలు మంజూరు చేయాలని సండ్ర వెంకటవీరయ్య.. పేదలకు ఇల్లు ఇచ్చేందుకు సేకరించిన భూమిని వెంటనే పంపిణీ చేయాలని భూపాల్‌‌రెడ్డి.. అలంపూర్‌‌లో రెసిడెన్షియల్‌‌ మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అబ్రహం విజ్ఞప్తి చేశారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయాలని, కొట్టుకుపోయిన కాజ్‌‌వే స్థానంలో బ్రిడ్జి నిర్మించాలని కొడంగల్‌‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌ రెడ్డి కోరారు.

ముంపు బాధితులకు పరిహారమివ్వాలి
బుడమేరుపై ఆనకట్ట ఎనిమిదేళ్లుగా పెండింగ్‌‌లో ఉందని, అన్ని పర్మిషన్‌‌లు ఉన్న ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని భట్టి విక్రమార్క కోరారు. చల్వాయిలో పోలీస్‌‌ బెటాలియన్‌‌ కోసం 200 ఎకరాల పేదల భూములు స్వాధీనం చేసుకున్నారని, వారి భూములకు పరిహారం ఇవ్వడంతో పాటు భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని సీతక్క కోరారు. 2009లో రిక్రూట్‌‌ అయిన ఎస్సైలకు ప్రమోషన్లలో అన్యాయం జరుగుతోందని, వరంగల్‌‌ జోన్‌‌లో వారికన్నా జూనియర్‌‌లకు ప్రమోషన్‌‌లు ఇచ్చారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఓల్డ్‌‌సిటీలో శానిటేషన్​ అధ్వానంగా ఉందని, సిబ్బంది సంఖ్య పెంచాలని ఎమ్మెల్యే పాషాఖాద్రీ కోరారు. హైదరాబాద్‌‌లో నాలాల్లో పూడిక తీయాలని  అహ్మద్‌‌ బలాలా విజ్ఞప్తి చేశారు.

నిధుల్లేక మా కలెక్టరేట్‌‌ కంప్లీట్‌‌ కాలే: మెదక్‌‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌‌ రెడ్డి
కొద్దిపాటి నిధులు ఇస్తే మెదక్‌‌ జిల్లా కలెక్టరేట్‌‌ కంప్లీట్‌‌ అవుతుందని, నిధులివ్వకనే పనులు పూర్తి కాలేదని మెదక్‌‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌‌ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో పద్దులపై చర్చలో ఆమె పాల్గొన్నారు. వీలైనంత త్వరగా కలెక్టరేట్‌‌ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీస్‌‌ల కరెంట్‌‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మెదక్‌‌కు రింగ్‌‌ రోడ్డు ఇచ్చేలా నేషనల్‌‌ హైవే పనులు చేపట్టాలని కోరారు.