కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌‌‌‌ను సస్పెండ్‌‌ చేయాలె

కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌‌‌‌ను సస్పెండ్‌‌ చేయాలె


  లోక్‌‌సభలో టీఆర్‌‌ఎస్‌‌ సభ్యుల ఆందోళన
    గిరిజన రిజర్వేషన్లపై పార్లమెంట్‌‌ను తప్పుదోవ పట్టించిన్రు
    రూల్‌‌ 222 కింద కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోవాలి
    సభ నుంచి వాకౌట్‌‌ చేసిన టీఆర్​ఎస్​ ఎంపీలు
    అంతకుముందు స్పీకర్‌‌కు ప్రివిలేజ్‌‌ నోటీస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ట్రైబల్‌‌ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంట్‌‌ను తప్పుదోవ పట్టించిన మంత్రి బిశ్వేశ్వర్‌‌ తుడును సస్పెండ్‌‌ చేయాలని లోక్‌‌సభలో టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీలు బుధవారం ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 6.8 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, గెజిట్‌‌ను హోం మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం 2017లోనే పంపినా, కేంద్ర మంత్రి అవగాహన లేకుండా సభను తప్పుదోవ పట్టించారని నినాదాలు చేశారు. ట్రైబల్‌‌ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌‌ చేశారు. రాష్ట్రంలోని గిరిజనులపై కేంద్రం తీరు సరిగా లేదని ఫైర్ అయ్యారు. తర్వాత లోక్‌‌సభ నుంచి వాకౌట్‌‌ చేశారు. అంతకుముందు ఎంపీలు కేంద్ర మంత్రిపై స్పీకర్‌‌కు ప్రివిలేజ్‌‌ మోషన్‌‌ నోటీస్‌‌ అందజేశారు. ఈనెల 21న లోక్‌‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం.. సభ్యులుగా తమ హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని పేర్కొన్నారు. రూల్‌‌ 222 కింద కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ నుంచి పంపిన గెజిట్‌‌ నోటిఫికేషన్‌‌ తమకు అందిందని 2017 డిసెంబర్‌‌ 18న ట్రైబల్‌‌ వెల్ఫేర్‌‌ మినిస్ట్రీ నుంచి రాష్ట్రానికి సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ వాస్తవాన్ని కేంద్ర మంత్రి తొక్కి పెట్టి సభను పక్కదోవపట్టించారని తెలిపారు. స్పీకర్‌‌ను కలిసిన వారిలో ఎంపీలు మాలోతు కవిత, పి.రాములు, వెంకటేశ్‌‌, దయాకర్‌‌, బీబీ పాటిల్‌‌, రంజిత్‌‌ రెడ్డి, ప్రభాకర్‌‌ రెడ్డి, నామా నాగేశ్వర్‌‌ రావు, శ్రీనివాస్‌‌ రెడ్డి ఉన్నారు.

ఇయ్యాల గోయల్‌‌తో మంత్రులు, ఎంపీల భేటీ

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు గురువారం ఉదయం 11.40 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్‌‌ గోయల్‌‌తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు భేటీ కానున్నారు. బుధవారం రాజ్యసభ లాబీలో టీఆర్‌‌ఎస్‌‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు నాయకత్వంలో ఎంపీలు.. కేంద్ర మంత్రిని కలిసి తమకు అపాయింట్‌‌మెంట్‌‌ ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు రాష్ట్రం నుంచి నలుగురు మంత్రులు ఢిల్లీకి వచ్చారని తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం 11.40 గంటలకు పార్లమెంట్‌‌లోని తన చాంబర్‌‌లో కలవాలని పీయూష్‌‌ గోయల్‌‌.. కేకేకు సమాచారం ఇచ్చారు. మంత్రులు నిరంజన్‌‌ రెడ్డి, గంగుల కమలాకర్‌‌, ప్రశాంత్‌‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌‌ మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. వన్‌‌ నేషన్‌‌ – వన్‌‌ ప్రొక్యూర్‌‌మెంట్‌‌ విధానం తీసుకురావాలని, పంజాబ్‌‌ తరహాలోనే రాష్ట్రంలో పండిన మొత్తం వరి ధాన్యం కేంద్రమే కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కోరనున్నారు.

ఉత్పత్తి ఆధారిత ధాన్యం సేకరణ సాధ్యం కాదు: కేంద్ర మంత్రులు

రాష్ట్రాల్లో పంట ఉత్పత్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేకరణ సాధ్యం కాదని కేంద్ర మంత్రులు పీయూష్‌‌ గోయల్‌‌, సాధ్వి నిరంజన్‌‌ జ్యోతి తేల్చిచెప్పారు. బుధవారం లోక్‌‌సభలో ధాన్యం సేకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వంగా సమాధానమిచ్చారు. ధాన్యం సేకరణకు ఉత్పత్తి ఒక్కటే ప్రామాణికం కాదని, అనేక అంశాలు ముడిపడి ఉంటాయని తెలిపారు. కనీస మద్దతు ధర, డిమాండ్‌‌, సప్లయ్‌‌, మార్కెట్‌‌లో ఉన్న ధరలు, ఇతర పరిస్థితుల ఆధారంగానే ధాన్యం సేకరణ ఉంటుందని తెలిపారు. ఎఫ్‌‌సీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కనీస మద్దతు ధర చెల్లించి ముడిబియ్యం (రా రైస్‌‌) సేకరిస్తున్నామని తెలిపారు. ఎఫ్‌‌సీఐతో చర్చించి ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరిస్తామన్నారు. అలా సేకరించిన ధాన్యాన్ని ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్రాలకు కేటాయిస్తామని తెలిపారు.