
- 32 జడ్పీలూ కైవసం చేసుకున్న అధికార పార్టీ
- 3,500 పైగా ఎంపీటీసీలు,447 జడ్పీటీసీల్లో టీఆర్ఎస్దే విజయం
- కాంగ్రెస్‌కు 1,394 ఎంపీటీసీ, 77 జడ్పీటీసీలు
- ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయిన బీజేపీ
- పోలింగ్‌కు ముందే 4 జడ్పీటీసీలు,158 ఎంపీటీసీలు ఏకగ్రీవం
- 7న ఎంపీపీ, 8న జడ్పీ చైర్ పర్సన్ల ఎన్నికలు
హైదరాబాద్, వెలుగు: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో రాష్ట్రవ్యాప్తంగా కారు జోరు కనిపించింది. అత్యధిక సీట్లు గెలుచుకుని, దాదాపు అన్ని జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎంపీటీసీల్లోనూ నాలుగింట మూడోవంతు గులాబీ పార్టీకే దక్కాయి. ఎంపీటీసీల్లో కాంగ్రెస్ కొంత పోటీ ఇచ్చినా జడ్పీటీసీల్లో వెనుకబడింది. బీజేపీ ఏ జిల్లాలోనూ నామమాత్రపు పోటీనీ ఇవ్వలేకపోయింది. ఎంపీటీసీల్లో 15 శాతం సీట్లలో ఇండిపెండెంట్లు గెలవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలి రౌండ్ నుంచే టీఆర్ఎస్ ఆధిక్యం కనిపించింది.
టీఆర్ఎస్ జోష్..
గత నెలలో రాష్ట్రంలోని 539 జడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగ్గా.. మంగళవారం కౌంటింగ్ జరిగింది. పోలింగ్‌కు ముందే నాలుగు జడ్పీటీసీలు, 158 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఒకటి, జగిత్యాలలో 2, నల్గొండలో ఒక జడ్పీటీసీ ఏకగ్రీవంకాగా.. నాలుగింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఒక జడ్పీటీసీ ఎన్నిక వాయిదా పడింది. మొత్తంగా 5,817 ఎంపీటీసీలకు గాను (ఏకగ్రీవాలు కలిపి ) టీఆర్ ఎస్ 3,555 చోట్ల, కాంగ్రెస్ 1,394 ఇండిపెండెంట్లు 659, బీజేపీ 208, టీడీపీ 21, లెఫ్ట్ పార్టీలు 78 చోట్ల గెలిచాయి. ఇక 534 జడ్పీటీసీలకు పోలింగ్‌కాగా.. టీఆర్ ఎస్ 447, కాంగ్రెస్ 77, బీజేపీ 8, లెఫ్ట్ 1, స్వతంత్రులు 6 సీట్లలో గెలిచారు. పలుచోట్ల స్వల్ప వాగ్వాదాలు మినహా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది.
- జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ కు లేఖ రాసి బ్యాలెట్ బాక్స్ లో వేసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు హల్ చల్ చేశాయి. దానిపై పలువురు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ లెటర్ బ్యాలెట్ బాక్స్ లో వేస్తే నలిగి ఉంటుందని, నోట్ బుక్ లో రాసి ఫోటో తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని అంటున్నారు.
- కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామాన్ని మండలంగా చేయాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాసి బ్యాలెట్ బాక్స్ లో వేశారు.
‘ఎంపీటీసీ ఇండిపెండెంట్లు’పార్టీల వాళ్లే..
ఇండిపెండెంట్ ఎంపీటీసీలుగా విజయం సాధించిన వారిలో చాలా మంది టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలే ఉన్నారు. వివిధ కారణాల వల్ల టికెట్ దక్కక ఇండిపెండెంట్లుగా పోటీ చేసి గెలిచారు. ఇలాంటి వారంతా అధికార టీఆర్ఎస్వైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
7, 8 తేదీల్లో ఎంపీపీ, జడ్పీ చైర్పర్సన్ల ఎన్నికలు
ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నికను ఈ నెల 7వ తేదీన, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, వైఎస్ చైర్పర్సన్ల ఎన్నికను 8వ తేదీన నిర్వహించనున్నారు. వాస్తవానికి ప్రస్తుతమున్న పరిషత్ పాలకమండళ్ల పదవీకాలం జులై 5వ తేదీ వరకు ఉంది. దాంతో ప్రస్తుతమున్న వారి పదవీకాలం పూర్తికాకున్నా, కొత్త వాళ్లు ప్రమాణ స్వీకారం చేయకుండానే.. ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎన్నికను నిర్వహించేలా సర్కారు పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేసింది. దాని ప్రకారం.. 7, 8 తేదీల్లో ఎన్నిక చేపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ పరిషత్‌ల పదవీకాలం ఆగస్టు 5తో ముగియనుంది.
అసెంబ్లీని తలదన్నే తీర్పు
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును తలదన్నేలా పరిషత్ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం ఫలితాలు ఇప్పటి వరకు ఏ పార్టీకి సాధ్యం కాలేదు. ఏకపక్ష విజయాన్ని మేము సైతం ఊహించలేదు. ఓటింగ్ విధానం బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా మా నాయకుడు కేసీఆరేనని ప్రజలు తీర్పు చెప్పారు. ఆరు జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీలు కనీసం ఖాతా తెరవలేదు. మరో ఆరు జిల్లాల్లో ఒక్కో జడ్పీటీసీ స్థానానికే పరిమితమైనయి. –టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్