భారత్ ను వదిలి రావడం ఆమె కలనట..జాక్‌పాట్‌ కొట్టిన యువతి

భారత్ ను వదిలి రావడం ఆమె కలనట..జాక్‌పాట్‌ కొట్టిన యువతి

భారత్‌ను వదిలి రావడం నా కల అంటూ కెనడాలోని ఓ యూట్యూబ్ చానెల్ కు చెప్పి ట్రోల్స్‌కు గురైన భారత్‌కు చెందిన యువతికి బంపర్ ఆఫర్ లభించింది. ఆ యువతికి ట్రూ కాలర్ సీఈవో (Truecaller CEO) ఏకంగా జాబ్ ఆఫర్ ఇచ్చారు.

భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఓ యూట్యూబర్ ఏక్తాను కొన్ని ప్రశ్నలు వేశాడు. మీ పేరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? కెనడాకు ఎందుకు వచ్చారు..? ఇక్కడ ఏం చేస్తున్నారు (జాబా లేక స్టడీసా)..? ఇక్కడ మీకు ఏం నచ్చింది..? వంటి ప్రశ్నలు వేశాడు.

కెనడాకు ఎందుకు వచ్చారు అన్న ప్రశ్నకు ఏక్తా సమాధానం ఇస్తూ.. భారత్‌ను వదిలి రావడం నా డ్రీమ్ అంటూ చెప్పింది. కెనడాలో బయోటెక్నాలజీ చేస్తున్నానని.. చదువు పూర్తవ్వగానే ఆ డిగ్రీతో ఇక్కడే వ్యాపార వృత్తిని కొనసాగించాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

కెనడాలో మీకు ఏం నచ్చింది అడిగిన ప్రశ్నకు.. అందమైన దృశ్యాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం కెనడాలో నచ్చుతాయంటూ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన భారత నెటిజన్లు ఏక్తాపై మండిపడుతున్నారు.

ఏంటీ భారత్ ను వదిలి వెళ్లడం నీ డ్రీమా అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. భారత్‌లో సూర్యోదయం, సూర్యాస్తమయం చూడలేకపోవడం చాలా బాధాకరం అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ వీడియో కాస్తా ట్రూ కాలర్ సీఈవో అలాన్ మామెడి దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన అలాన్.. బయట ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు పట్టించుకోకు అంటూ ఏక్తాకు సపోర్ట్ గా నిలిచారు.

నెటిజన్లు ఏక్తా మాటలను అపార్థం చేసుకున్నారని అలాన్ మామెడి చెప్పారు. ఆమెపై ట్రోలింగ్ చేయడం సరికాదన్నారు. ఏగతాళి చేస్తున్న వారిని పట్టించుకోకు అంటూ ఏక్తాకు ధైర్యం చెప్పారు.  కూల్ గా ఉండు అని సూచించారు. చదువు పూర్తవగానే ట్రూ కాలర్ లో పనిచేసేందుకు ఏక్తాకు అవకాశం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్ కార్యాలయంలో పనిచేయొచ్చు అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మామెడి ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు అతడికి మద్దతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ట్రోల్స్ కి గురవడం కూడా ఏక్తాకు మంచే చేసిందంటున్నారు.

https://twitter.com/AlanMamedi/status/1687075637423464448