ఇరాన్‌పై యుద్ధం కొనసాగించాలా వద్దా అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో వాడివేడిగా చర్చించుకున్నారు. ఇరాన్ తో డీల్ కుదుర్చుకునేందుకు యూఎస్ మొగ్గుచూపుతుండగా, ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం కొనసాగించాలనే భావిస్తున్నదని తెలిసింది.
వాషింగ్టన్: ఇరాన్ పై యుద్ధం కొనసాగించాలా వద్దా అనే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ లో వాడివేడిగా చర్చించుకున్నారు. యుద్ధంపై ఇద్దరూ దాదాపు కొన్ని గంటల పాటు మాట్లాడుకున్నారు. యుద్ధం కొనసాగించడం కన్నా ఇరాన్ తో డీల్ కుదుర్చుకునేందుకు యూఎస్ మొగ్గుచూపుతున్నదని యూఎస్ మీడియా యాక్సిస్ పేర్కొంది. ముందు డీల్ కుదుర్చుకోవడానికి ఇరాన్ కు ఒక అవకాశం ఇవ్వాలని ట్రంప్ ఆలోచిస్తున్నారని, డీల్ కుదరకపోతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని యాక్సిస్ వెల్లడించింది.
మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం కొనసాగించాలనే భావిస్తోందని వెల్లడించింది. ఇరాన్ మిలిటరీ శక్తిసామర్థ్యాలపై భారీగా దెబ్బకొట్టడంతో పాటు ఆ దేశ కీలక మౌలిక స్థావరాలను కూడా ధ్వంసం చేయాలని నెతన్యాహు భావిస్తున్నారని తెలిపింది. శాంతిచర్చలకు ఆయన ఏమాత్రం సుముఖంగా లేరని పేర్కొంది.
ట్రంప్ వ్యూహాలతో నెతన్యాహు విభేదించారని ఇజ్రాయెల్ వర్గాలు తెలిపినట్లు యూఎస్ మీడియా సంస్థ వెల్లడించింది. దాడులను వాయిదా వేయడం తప్పని ట్రంప్ కు నెతన్యాహు చెప్పినట్లు ఇజ్రాయెల్ వర్గాలను ఉటంకిస్తూ యాక్సిస్ తెలిపింది. ఈ విషయంలో నెతన్యాహు తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారని ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొన్నట్లు యాక్సిస్ వివరించింది. కాగా.. అరబ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్ పై దాడులను వాయిదా వేశానని ట్రంప్ ఇటీవలే పేర్కొన్నారు.
