8 నెలల్లో 8 యుద్ధాలు ఆపేశా.. త్వరలో పాక్-ఆప్ఘాన్ వివాదం ముగిస్తా: ట్రంప్

8 నెలల్లో 8  యుద్ధాలు ఆపేశా.. త్వరలో పాక్-ఆప్ఘాన్ వివాదం ముగిస్తా: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. తాను అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక 8 నెలల్లో 8 యుద్ధాలు ఆపానని ప్రగల్భాలు పలికారు. త్వరలోనే పాక్-ఆప్ఘాన్ వివాదాన్ని కూడా పరిష్కరిస్తానని అతి విశ్వాసం ప్రదర్శించారు. ఆదివారం (అక్టోబర్ 27) మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన ASEAN శిఖరాగ్ర సమావేశం సందర్భంగా థాయిలాండ్-కంబోడియా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.

 ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. తన నాయకత్వంలో ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ముగించానని చెప్పారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా త్వరగా శాంతిని తీసుకువస్తానని.. ఆ రెండు దేశాల అధినేతలు తనకు చాలా బాగా తెలుసని పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో 8 యుద్ధాలు ముగించడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదని.. ఇకమీదట కూడా ఇది సాధ్యం కాదని పగల్భాలు పలికారు. 

యుద్ధాలను ముగించడం అనేది ఒక గొప్ప పనిగా తాను భావిస్తున్నానని.. లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలిగితే అది గొప్ప కృషి అవుతుందన్నారు. ఒక యుద్ధాన్ని పరిష్కరించిన ఏ అధ్యక్షుడి గురించి తాను ఆలోచించలేనని.. వాళ్లు కేవలం యుద్ధాలను ప్రారంభిస్తారని.. వాటిని పరిష్కరించరన్నారు. కాగా, ట్రంప్ తాను ఆపానని చెప్పుకుంటున్న 8 యుద్ధాల్లో ఇండియా, పాక్ వివాదం కూడా ఒకటి. 

కానీ ట్రంప్ ఆరోపణలను భారత్ ఎప్పటికప్పుడూ తిప్పికొట్టింది. ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో వ్యక్తి లేదా దేశ ప్రమేయం లేదని ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది. ఇండియా ఎన్నోసార్లు ఖండించినప్పటికీ.. ఇండియా, పాక్ వార్ తానే ఆపానని డప్పు కొట్టుకుంటున్నారు.