ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఒక కీలక ప్రకటన చేశారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ "మూడవ ప్రపంచ దేశాల నుంచి పర్మనెంట్ రెసిడెంట్లను ఆపనున్నట్లు" ప్రకటించారు. ఇది అమెరికన్ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించుకోవడానికి సహాయపడుతుందని చెప్పారు. అమెరికా సాంకేతిక అభివృద్ధిలో ఉన్నప్పటికీ.. వలస విధానాలు పురోగతిని క్షీణింపజేస్తున్నాయని తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ పాలసీ పురోగతికి చెడు ప్రభావం కలిగించటంతో పాటు అనేక మంది జీవన ప్రమాణాలు తగ్గాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బైడెన్ కాలం నాటి రూల్స్ పూర్తిగా రద్దు చేయాలని.. అమెరికా సమాజానికి నష్టం కలిగిస్తున్న వ్యక్తులను శాశ్వతంగా డిపోర్టేషన్ చేయాలని ట్రంప్ అన్నారు. అమెరికాను ప్రేమించలేని ప్రతి వ్యక్తిని తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారే వ్యక్తులను పంపటం నుంచి సబ్సిడీలు నిలిపివేత వరకు చర్యలు ఉండనున్నట్లు ట్రంప్ కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. అనధికారిక వలసను కట్టడి చేయటంతో పాటు రివర్స్ మైగ్రేషన్ మాత్రమే సమస్యను పూర్తిగా పరిష్కరించగలదని ట్రంప్ భావిస్తున్నారు.
జో బైడెన్ సమయంలో ఆఫ్గన్ నుంచి భారీగా మనుషుల ఎయిర్ లిఫ్టింగ్ చిత్రాలను పంచుకుంటూ.. అనధికారిక వలసలు, అసురక్షితమైన ఇమ్మిగ్రెంట్ల గురించి ప్రస్తావిస్తూ దేశాన్ని అవి ధ్వంసం చేశాయని అన్నారు. ట్రంప్ పరిపాలన బైడెన్ పరిపాలన కాలంలో ఆమోదమైన అసైలం కేసులపై పూర్తి స్థాయి సమీక్ష మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 19 దేశాల పౌరులకు గ్రీన్ కార్టులు జారీ చేసిన నియమాలను కూడా పునర్విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ ప్రభుత్వం జనవరి 20 నుండి ఇప్పటి వరకు సుమారు 80వేల వీసాలను రద్దు చేసింది. డ్రంకెన్సీ, హింస, దొంగతనంతో సంబంధించి ఈ వీసాలు నిలిపివేయబడ్డాయి. అలాగే సోషల్ మీడియా వెట్టింగ్ కూడా మరింత కఠినతరం చేసింది. అయితే ట్రంప్ ఈ క్రమంలో అసలు థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే ఏంటి అందులో ఎవరెవరు ఉన్నారనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
