- ఇరాన్‌తో శాంతి చర్చల పురోగతి నేపథ్యంలో ట్రంప్ నిర్ణయం
- పాక్ అభ్యర్థనతో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రూత్ సోషల్‌లో పోస్ట్
- ఇరాన్ ఓడరేవులపై సైనిక దిగ్బంధం కొనసాగుతుందని వెల్లడి
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అవకాశం కల్పించేందుకే ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను కొద్దికాలం పాటు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ బుధవారం తన ట్రూత్ సోషల్ లో పోస్ట్‌చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన సైనిక దిగ్బంధం మాత్రం అలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతినిధులతో తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి లభించిందని ట్రంప్ తెలిపారు. ‘పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాల అభ్యర్థన మేరకు.. ఇరాన్ కు వ్యతిరేకంగా మనం జరిపిన పోరాటంలో సాధించిన అద్భుతమైన సైనిక విజయం, ఇరాన్ ప్రతినిధులతో ఒక సంపూర్ణ తుది ఒప్పందం దిశగా గొప్ప పురోగతి సాధించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమలులో ఉన్నప్పటికీ, ఒప్పందాన్ని ఖరారు చేసి సంతకం చేసే వరకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను కొద్ది కాలం పాటు నిలిపివేయాలని మేం పరస్పరం అంగీకరించాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగిసింది: రూబియో
ఇరాన్‌పై చేపట్టిన ప్రాథమిక ప్రధాన సైనిక చర్య ‘ఎపిక్ ఫ్యూరీ’ ముగిసిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. అయితే, శాంతి నెలకొనాలంటే ఇరాన్ తన అణు కార్యక్రమాలపై ట్రంప్ డిమాండ్లను అంగీకరించాలని, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఆయన షరతు విధించారు. పశ్చిమాసియాలో కాల్పుల విరమణ ఇంకా కొనసాగుతోందని.. అయితే, వివాదం పరిష్కారం కానప్పటికీ, ఇరాన్‌పై అమెరికా చేపట్టిన తొలి ప్రధాన సైనిక చర్య ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ప్రెసిడెంట్ట్రంప్.. కాంగ్రెస్‌కు తెలియజేసినట్టుగా ఎపిక్ ఫ్యూరీలోని ఆ దశను తాము పూర్తి చేశామని రూబియో తెలిపారు. కాగా, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రస్తుతం బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల అమెరికా కంటే చైనా ఆర్థిక వ్యవస్థే ఎక్కువ దెబ్బతింటుందని.. కాబట్టి, ఇరాన్‌ను ఒప్పించాల్సిన బాధ్యత చైనాపై ఉందని రూబియో అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నౌకలు అక్కడ చిక్కుకుపోయాయని, వాటిని రక్షించే సామర్థ్యం కేవలం అమెరికా నౌకాదళానికే ఉందని, అందుకే తాము ఈ బాధ్యత తీసుకున్నామని రూబియో పేర్కొన్నారు.
హార్మూజ్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు
హార్మూజ్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ లో భాగంగా అమెరికా సైన్యం.. నౌకలకు రక్షణగా వెళ్తున్న సమయంలో ఇరాన్ దాడులకు దిగింది. తమకు అనుమతి లేని మార్గాల్లో నౌకలు ప్రయాణిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్హెచ్చరించాయి. మరోవైపు, ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకుంటున్నామనియూఏఈ ప్రకటించగా, ఇరాన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. తమ సాయుధ దళాలు ఎలాంటి క్షిపణి లేదా డ్రోన్ దాడులు చేపట్టలేదని ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా కమాండ్ పేర్కొంది.
