అమెరికాలో 43 రోజుల తర్వాత ముగిసిన షట్‌‌డౌన్‌‌.. ఫండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం..

అమెరికాలో 43 రోజుల తర్వాత ముగిసిన షట్‌‌డౌన్‌‌.. ఫండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి గవర్నమెంట్​ ఫండింగ్ ​బిల్లుపై సంతకం చేశారు. దీంతో అమెరికాలో రికార్డు స్థాయిలో 43 రోజుల పాటు కొనసాగిన షట్‌‌‌‌డౌన్‌‌‌‌ ముగిసింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌‌‌‌లో ఈ బిల్లు 222.. 209 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. సెనేట్ సోమవారమే బిల్లును ఆమోదించింది. ఈ ఏడాది చివరిలో ముగిసిపోతున్న అఫర్డబుల్ కేర్ యాక్ట్ (ఏసీఏ) మార్కెట్‌‌‌‌ప్లేస్‌‌‌‌ల ద్వారా ఆరోగ్య బీమా ఖర్చును తగ్గించే ఎన్‌‌‌‌హాన్స్‌‌‌‌డ్ ట్యాక్స్ క్రెడిట్​ను పొడిగించాలని డెమోక్రాట్లు కోరారు. అయితే, ఈ ప్రాధాన్యత లేని షార్ట్-టర్మ్ ఫండింగ్ బిల్లుకు రిపబ్లికన్​లు అంగీకరించలేదు.  ఈ అంశాన్ని వేరే సమయంలో చర్చించవచ్చని సూచించారు. దీంతో డెమొక్రాట్లు, రిపబ్లికన్​ల మధ్య  వివాదం తలెత్తి అమెరికాలో షట్​డౌన్​కు దారి తీసింది. గత నెల అక్టోబర్​1న ప్రారంభమైన షట్​డౌన్​అమెరికా చరిత్రలోనే తొలిసారి 43 రోజుల పాటు కొనసాగింది. 2018 19 మధ్య దాదాపు 35 రోజుల పాటు కొనసాగింది. ప్రస్తుత షట్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ కారణంగా అమెరికాలోని ఫెడరల్ ఉద్యోగులు జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, బిల్లుపై సంతకం చేయడానికి ముందు ట్రంప్​ మాట్లాడుతూ.. ఈ పరిస్థితికి కారణం డెమొక్రాట్లేనని ఆరోపించాడు. “అమెరికన్ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. దీన్ని మరచిపోకండి. మధ్యంతర ఎన్నికలు, ఇతర విషయాలు వచ్చినప్పుడు, వారు మన దేశానికి చేసిన దాన్ని మరచిపోకండి. వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు ఆ పార్టీని శిక్షించాలి” అని సూచించారు. 

అమెరికన్లకు శిక్షణనివ్వండి..
వెళ్లిపోండి: స్కాట్ బెసెంట్

హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వీసాలపై అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీసాలకు సంబంధించి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త విధానం తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు తీసుకొచ్చి, వాళ్ల ద్వారా అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. అమెరికాలో తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు నాలెడ్జ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ లక్ష్యంగా ఈ పాలసీ ఉంటుందని పేర్కొన్నారు. ‘‘అమెరికాకు రండి.. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి.. తర్వాత తిరిగి వెళ్లిపోండి” అనేదే ట్రంప్ కొత్త విధానమని వివరించారు. గురువారం ఫాక్స్ న్యూస్‌‌‌‌‌‌‌‌తో స్కాట్ బెసెంట్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హెచ్‌‌‌‌‌‌‌‌1బీ కొత్త విధానంపై స్పందిస్తూ.. ‘‘మేం తయారీ రంగంలో గత కొన్ని దశాబ్దాలుగా విదేశీ కార్మికులపైనే ఆధారపడుతున్నం. అత్యధిక నైపుణ్యాలున్న వ్యక్తులు మా దగ్గర లేరు. యూఎస్‌‌‌‌‌‌‌‌లో తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. మళ్లీ అమెరికాకు సెమీకండక్టర్ ఇండస్ట్రీని తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నాం” అని వివరించారు.  

ఇండియా సంస్థపై ఆరోపణలు

ఇండియాకు చెందిన ఫార్మ్‌‌‌‌లేన్ ప్రైవేట్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ అనే సంస్థకు యూఏఈలోని మార్కో క్లింగే అనే కంపెనీతో సంబంధాలున్నాయని, ఈ సంస్థలు సోడియం క్లోరేట్‌‌‌‌, సోడియం పెర్క్లోరేట్‌‌‌‌ వంటి రసాయనాలను ఇరాన్‌‌‌‌ కు సరఫరా చేయడంలో సహకరించినట్లు అమెరికా ఆరోపించింది. ఇరాన్‌‌‌‌ క్షిపణి, డ్రోన్‌‌‌‌ తయారీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు మరో మూడు దేశాల్లో ఉన్న సంస్థలపైనా  చర్యలు తీసుకుంటామని చెప్పింది.