అదే నిజమైతే.. ఇండియా భారీ సుంకాలు చెల్లించాల్సిందే: భారత్‎కు మరోసారి ట్రంప్ వార్నింగ్

అదే నిజమైతే.. ఇండియా భారీ సుంకాలు చెల్లించాల్సిందే: భారత్‎కు మరోసారి ట్రంప్ వార్నింగ్

వాషింగ్టన్: రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో ఇండియాకు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఆపేంత వరకు ఇండియా భారీ సుంకాలు చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇకపై ఇండియా ఇలాంటి పని చేయదని అనుకుంటున్నానని అన్నారు. తన అధికారిక ఎయిర్ ఫోర్స్ వన్‌ విమానంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని భారత ప్రధాని మోడీ తనకు మాటిచ్చారని తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. 

అయితే.. ఈ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించిందని మీడియా ప్రతినిధులు ట్రంప్‎కు గుర్తు  చేయగా.. అదే నిజమైతే ఇండియా భారీ సుంకాలు చెల్లిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. కానీ ఇండియా ఇకపై అలా చేయాలనుకోవడం లేదని పేర్కొన్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపేస్తామని మోడీ తనకు మాటిచ్చారని వారంలోనే ట్రంప్ మూడోసారి కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. దేశ పౌరుల అవసరాలకే భారత్ తొలి ప్రాధ్యానత ఇస్తుందని పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలకు ఇండియా కౌంటర్ ఇచ్చింది.  

కాగా, మూడేళ్లుగా ఉక్రెయిన్‎తో యుద్ధం చేస్తోన్న రష్యాతో వాణిజ్యం చేయొద్దని ప్రపంచ దేశాలను ట్రంప్ హెచ్చరిస్తు్న్న విషయం తెలిసిందే. అయితే.. భారత్ మాత్రం దేశ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. 

తన మాట ధిక్కరించి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న అక్కసుతో ఇండియా ఎగుమతులపై ట్రంప్ 25 శాతం అదనపు సుంకాలు విధించాడు. అయినప్పటికీ దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలును ఇండియా ఆపలేదు. ఈ నేపథ్యంలో రష్యా ఆయిల్ కొనుగోలు విషయంలో ఇండియాకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్.