మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని పడగొట్టండి

మీకు దమ్ముంటే నా ప్రభుత్వాన్ని పడగొట్టండి

బీజేపీకి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సవాల్
ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ సర్కార్‌‌కు దమ్ముంటే తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఉద్ధవ్ సవాల్ విసిరారు. తమ పార్టీ హిందూత్వను గంటలు, థాలీలు మోగించడానికి పరిమితం చేయలేదన్నారు. దాదర్‌‌లోని సావర్కర్ హాల్‌‌లో నిర్వహించిన శివ సేన పార్టీ వార్షిక దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఉద్ధవ్ పైవ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాటిస్తున్న హిందూత్వకు తమ పార్టీ నమ్మే హిందూత్వ సిద్ధాంతాలకు చాలా తేడా ఉందని ఠాక్రే స్పష్టం చేశారు.

‘నేను సీఎం అయినప్పటి నుంచి నా ప్రభుత్వాన్ని ఫలానా రోజున పడగొడతారంటూ అనేక తేదీలు ప్రచారంలో ఉండటాన్ని విన్నా. కానీ అది జరగలేదు. ఒకవేళ మీకు దమ్ముంటే మీరు మళ్లీ ప్రయత్నించండి. నా సర్కార్‌‌ను పడగొట్టి చూపించండి. మా హిందూత్వ మీ (బీజేపీ) హిందూత్వ కంటే చాలా ప్రాచీనమైంది, అలాగే వైవిధ్యమైంది కూడా.. హిందూత్వ గురించి ఒక్క మాట మాట్లాడటానికీ అందరూ భయపడుతున్న తరుణంలో.. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే హిందూయిజం గురించి చాలా విషయాలు మాట్లాడారు. మా హిందూత్వ కేవలం దేవతలు, ఆలయాలు, పూజలు, గంటలు, థాలీలు మోగించడం వంటి వాటికి మాత్రమే పరిమితమవ్వదు. మా హిందూత్వనే మా జాతీయవాదం. మీరు మహారాష్ట్రలో గో పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ అదే చట్టాన్ని గోవాలో మాత్రం అమలు చేయడం లేదు. బిహారీలకు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి దేశంలోని మిగతా రాష్ట్రాలు బంగ్లాదేశ్ లేదా కజకిస్థాన్‌‌లో ఉన్నాయా?’ అని ఠాక్రే చెప్పారు.