
- కేసుల నమోదు.. కూల్చివేతలు ప్రారంభం
- ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై కేసు నమోదు
- సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై ఎంక్వైరీ
- నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లోనూ భూఆక్రమణలపై విచారణ
- ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు
వెలుగు, నెట్వర్క్/ఖమ్మం: పదేండ్లుగా బీఆర్ఎస్ నేతలు సాగించిన భూదందాలపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో ధరణితో గులాబీ పార్టీ పెద్దలు చేసిన భూఆక్రమణలపై ఇప్పటికే ఫోకస్ పెట్టగా, జిల్లాల్లో నాటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల కబ్జాలపైనా ఎంక్వైరీలు మొదలు పెట్టింది. బీఆర్ఎస్ నేతల కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా.. విచారణ జరపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మేరకు పలు జిల్లాల్లో రంగంలోకి దిగుతున్న ఆఫీసర్లు అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ.. కేసులు నమోదు చేస్తున్నారు. ఖమ్మం సిటీలో 415 చదరపు గజాల స్థలాన్ని 59 జీవో కింద అక్రమంగా రెగ్యులరైజ్ చేసుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై ఆదివారం అధికారులు కేసు నమోదు చేశారు. ఆ స్థలంలో నిర్మించిన షెడ్డును నేలకూల్చారు.
నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా..
ఖమ్మం సిటీలో బీఆర్ఎస్ లీడర్లు కబ్జా చేసిన భూములపై ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. 59 జీవో కింద జరిగిన అక్రమ రెగ్యులరైజేషన్ ఫైళ్ల దుమ్ముదులుపుతున్నారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంప్ ఏరియాలో సర్వే నెంబర్ 92 లోని(ఇంటి. నెం. 11-11- 20/6 లో) కోట్ల రూపాయలు విలువజేసే 415 చదరపు గజాల స్థలాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య ఆక్రమించి, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఎన్నికల తర్వాత అధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో ఆమె రెగ్యులరైజేషన్ కోసం పెట్టుకున్న హౌస్ నంబర్ దాదాపు పదేండ్ల కింద కూల్చేసిన ఇంటిదని ఎంక్వైరీలో గుర్తించారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ఆదేశాలతో రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసిన అధికారులు.. ప్లాట్ లో ఉన్న రేకుల షెడ్ ను కూల్చేసి, భూమిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నించారని విచారణలో తేలడంతో అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీవిద్యపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 420, 467, 468, 471 కింద కేసు నమోదు చేశారు.
59 జీవోతోనే ఎక్కువ..
పేదల ఇండ్లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం సర్కారు తెచ్చిన 58, 59 జీవోలను బీఆర్ఎస్నేతలు భూకబ్జాలకు వాడుకున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లి తండా, శానాయిపల్లి పరిధిలో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.. వాటిని అమ్ముకున్నారు. నిరుడు మే, జూన్నెలల్లో100కు పైగా టెంపరరీ ఇళ్లు నిర్మింపజేసి జీఓ 59 కింద రెగ్యులరైజ్‌చేసి ఇచ్చారు. ఖమ్మం సిటీలో మాజీ మంత్రి అండచూసుకొని పలువురు బీఆర్ఎస్కార్పొరేటర్లు భూదందాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు భూకబ్జాలకు పాల్పడటంతో పాటు, ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూస్‌లో తలదూర్చి వాటిని స్వాధీనం చేసుకోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. బాధితులు ఆఫీసర్లకు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన తుమ్మల నాగేశ్వర్రావు ప్రధానంగా బీఆర్ఎస్ లీడర్ల భూకబ్జాలు, వేధింపులపైనే ఫోకస్‌చేసి ప్రచారం చేశారు. ఖమ్మం నుంచి తుమ్మల విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో భూ ఆక్రమణల బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
2018 తర్వాత పెరిగిన ఆక్రమణలు..
2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా భూఆక్రమణలు పెరిగిపోయాయి. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పలువురు లీడర్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ, అసైన్డ్, చెరువు శిఖాలు, ఎండోమెంట్భూములను ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. దిక్కుతోచని బాధితులు జిల్లాల్లో ఉన్నతాధికారులు, పోలీస్ ఆఫీసర్లకు మొరపెట్టకున్నా కబ్జాదారులు అధికారపార్టీ నేతలు కావడంతో చర్యలకు వెనుకాడారు. పలు కేసుల్లో బాధితులు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కి ఇప్పటికీ తిరుగుతున్నారు. బీఆర్ఎస్ హయంలో జరిగిన కొన్ని కబ్జాలు సంచలనం రేకెత్తించాయి. పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్ పంచాయతీ పరిధిలోని 24 ఎకరాల రంగనాయక స్వామి ఆలయ భూములను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చట్టవిరుద్ధంగా మ్యుటేషన్చేయించుకున్నారంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఎమ్మెల్యేతో పాటు దేవాదాయ కమిషనర్, పెద్దపల్లి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, రంగనాయకస్వామి ఆలయ ఈఓకు నోటీసులు జారీ చేయడం అప్పట్లో కలకలం రేపింది. మెదక్‌జిల్లా శివ్వంపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన ఓ ప్రజాప్రతినిధి కొంతాన్ పల్లిలోని సర్వే నంబర్ 338, 339లో 40 మంది దళిత రైతులకు చెందిన 26 ఎకరాల అసైన్డ్‌భూమిని కబ్జా చేసి రియల్టర్‌కు అమ్ముకున్నాడు. అడ్డుకున్న12 మంది దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టించడం అప్పట్లో వివాదాస్పదమైంది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ లోని 32 సర్వే నంబర్లో 50 నుంచి 60 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్లీడర్లు కబ్జా చేశారు. గతంలో అక్కడ వీఆర్ఓగా పని చేసిన నర్సింహాచారి దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన అనిల్ ఇంట్లో దాడి చేయగా ఐదు బస్తాల దొంగ డాక్యుమెంట్లు దొరకడం సంచలనం సృష్టించింది.
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొందరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు బరితెగించి మహిళా డిగ్రీ కాలేజీకి చెందిన మూడెకరాల భూమిని కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. దీనిపై ‘వెలుగు’లో స్టోరీ రావడం, ప్రజాసంఘాలు ఆందోళన చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసర్లు స్వాధీనం చేసుకొని కాలేజీకి అప్పగించారు. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ కు చెందిన ఓ లీడర్, రిమ్స్ వెనుకాల గల పార్కును కబ్జా చేశాడు. దీనిపైనా ‘వెలుగు’లో వార్త రావడంతో విచారణ జరిపిన మున్సిపల్ ఆఫీసర్లు ఆక్రమణకు గురైన 23 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమనపల్లిలోని సర్వే నంబర్306లో గల పది ఎకరాల పల్లె ప్రకృతి వనాన్ని రెండు నెలల కింద అప్పటి అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారు. ఇందులో మూడేళ్ల కిందట పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయగా, రెండు నెలల కింద బీఆర్ఎస్ నాయకులు రాత్రికి రాత్రి మొక్కలు నరికి వేసి ఆక్రమించారు. దీనిపై పంచాయతీ సెక్రెటరీ పోలీసులకు కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఏ జిల్లాలో చూసినా ఇలాంటి కబ్జాలు కోకొల్లలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలు ఉండటంతో ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.
మూడు గ్రామాల్లో 200 ఎకరాలు..
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కుడకుడ గ్రామంలో 126 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని 14 మంది బీఆర్ఎస్ నాయకులు కబ్జా పెట్టి జీవో 59 కింద రెగ్యులరైజ్చేసుకున్నారు. తాజాగా ఈ భూములపై రెవెన్యూ ఆఫీసర్లకు ఫిర్యాదు రావడంతో ఎంక్వైరీ ప్రారంభించారు. నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ లింగంపల్లి, నిర్మల్ మండలం రత్నపూర్ కాండ్లి, కొత్త పోచంపాడ్, లోకేశ్వరం గ్రామాల్లోని దాదాపు 200 ఎకరాల వరకు డీ వన్ పట్టా, అసైన్డ్, శిఖం భూములు కబ్జా అయినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో భూముల చెర విడిపించేందుకు తాజాగా ఆఫీసర్లు రంగంలోకి దిగారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలోని 315/1 నుంచి 315/9, 333,321/D, 312/1 సర్వే నంబర్లకు చెందిన ప్రభుత్వ భూములను బీఆర్ఎస్నేతలు ఆక్రమించుకున్నారు. తాజాగా కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలుస్తోంది. బాధితులు త్వరలోనే ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా, అక్రమార్కుల్లో టెన్షన్మొదలైంది.