ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం…

ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం…

హైదరాబాద్: అకాల వర్షాలతో కష్టాలుపడుతున్న రైతులకు  ఊరట కలిగిస్తూ.. ప్రభుత్వం వానా కాలం పంట.. వరి ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించింది. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంస్, జీసీసీ, ఏఎంసీ కొనుగోలు కేంద్రాల ద్వారా సివిల్ సప్లై శాఖ కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే హాకా ద్వారా మరో తొమ్మిది జిల్లాల్లో కొనుగోళ్లు జరపాలని నిర్ణయించింది. దీని కోసం మొత్తం 5690 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పంటలకు గ్రేడింగ్ ఆధారంగా మద్దతు ధరలు నిర్ణయించారు. ఏ గ్రేడ్ కు 1888, కామన్ వెరైటీ ధాన్యానికి 1868 రూపాయల కనీస మద్దతుధరగా నిర్ణయించారు. వానాకాలంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగే అవకాశం ఉందని ఒక అంచనా. సీఎంఆర్ బియ్యాన్ని 15 రోజుల్లో మిల్లర్లు ప్రభుత్వానికి అందించాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. గడువులోగా బియ్యం ఇవ్వని, పీడీఎస్ బియ్యాన్ని పక్కదారి పట్టించే మిల్లర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిల్లర్లు ఇచ్చే బియ్యాన్ని ప్రజాపంపిణీ వ్యవస్థ, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  ధాన్యం సేకరణ, సంబంధిత అంశాల కోసం టోల్ ఫ్రీ నంబర్ ను ప్రకటించింది సర్కార్. రైతులు తమ పంటల గురించి  180042500333, 1967 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. పాత గోనె సంచులను రికవరీ చేయాలని, అలాగే ప్రతి సీజన్ కు గోనె సంచులు రికవరీ చేసి నెలవారీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.