T20 World Cup: టీ20 ప్రపంచ కప్ లో ఇవాళ్టి నుంచి సూపర్–8 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో తలపడబోతున్నాయి. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా రెండు జట్లు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలో కివీస్ తో జరిగే మ్యాచ్‌కు ముందు పాక్ కి జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల శ్రీలంకలో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో వరల్డ్ కప్ 2026లో గ్రూప్ దశలోని పలు మ్యాచులు వర్షం దెబ్బకి రద్దైన సంగతి తెలిసిందే. సూపర్-8కి కూడా వాన గండం పొంచి ఉంది. న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ టీం చేయాల్సిన ప్రాక్టీస్ సెషన్ వర్షంతో రద్దయ్యింది. ఆర్.ప్రేమదాస గ్రౌండ్ లో దాదాపు 3 గంటల పాటు పాక్ ప్లేయర్లు నెట్స్‌లో సాధన చేయాల్సి ఉండగా.. భారీ వర్షంతో ప్రాక్టీస్ చేయలేకపోయారు. మ్యాచ్‌కు ముందు కీలకంగా భావించిన నెట్ ప్రాక్టీస్ లేకపోవడంతో దాయాది జట్టు టెన్షన్‌లో పడింది.
ఈరోజు (ఫిబ్రవరి 21న) భారీ వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొలంబో వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ (శనివారం) సాయంత్రం 7.00 గంటల సమయంలో 50 శాతానికి పైగా వర్షం పడే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. అలానే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్య వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షం ప్రభావం మ్యాచ్‌పై పడేలా కనిపిస్తుంది.
కొలంబోలో కురుస్తున్న వర్షం కారణంగా ఓవర్లు కుదించే అవకాశం కనిపిస్తుంది. ఒక జట్టు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి, రెండో జట్టు బ్యాటింగ్ సమయంలో వర్షం పడితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం కొత్త టార్గెట్‌ను అంపైర్లు ఫిక్స్ చేస్తారు. మ్యాచ్‌కు ఫలితం వచ్చేలా దాదాపు ట్రై చేస్తారు. ఎందుకంటే సూపర్–8లో ప్రతి మ్యాచ్ అన్ని జట్లకు చాలా కీలకం కాబట్టి, పూర్తిగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. రేపటి నుంచి భారత్ సూపర్-8లో తన వేటను స్టార్ట్ చేయనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రోటీస్ జట్టుతో తలపడబోతుంది.
