సర్కారు చదువులకు ప్లాన్​ లేదు.. ఫండ్స్​ లేవు

సర్కారు చదువులకు ప్లాన్​ లేదు.. ఫండ్స్​ లేవు
  • ఇప్పటికీ అకడమిక్  క్యాలెండర్
  • ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం
  • ఇంటర్​ ఫస్టియర్​కు ఆన్​లైన్​ క్లాసులు కూడా స్టార్ట్​ కాలే
  • పదిరోజుల్లో ఎంసెట్... ఇప్పుడు కోచింగ్​ ప్రారంభిస్తరట
  • బోర్డు ఎగ్జామ్స్​పై స్పష్టత కరువు
  • రూ. 2 వేల కోట్ల స్కూల్స్​ డెవలప్​మెంట్ స్కీమ్ పత్తా లేదు
  • విద్యావాలంటీర్లను, గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్​ చేస్తలే

హైదరాబాద్, వెలుగు: పిల్లల చదువులను రాష్ట్ర సర్కారు గాలికొదిలేసింది. విద్యాశాఖను పట్టించుకుంటలేదు. ఆన్ లైన్​ క్లాసులు చాలై  దాదాపు నెలరోజులైతున్నా ఇప్పటికీ అకడమిక్  క్యాలెండర్​ను ప్రకటించలేదు. దీనిపై సీఎం కేసీఆర్​ ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు. ఫండ్స్ లేవనే కారణంతో స్కూళ్లలో విద్యా వాలంటీర్లను, కాలేజీల్లో గెస్ట్​ లెక్చరర్లను రెన్యువల్ చేయడం లేదు. మరో పదిరోజుల్లో ఎంసెట్  ఉండగా, తీరిగ్గా ఇప్పుడు ఎంసెట్​కు ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్తున్నారు. 

కరోనా ఎఫెక్ట్​తో ఈ నెల ఫస్ట్ నుంచి మూడో తరగతి ఆపై క్లాసులకు ఆన్​లైన్, డిజిటల్ పాఠాలకు సర్కారు అనుమతి ఇచ్చింది. దీంతో 27,475 సర్కారు స్కూళ్లలో, 405 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదివే స్టూడెంట్ల కోసం యాదగిరి, టీశాట్ చానళ్ల ద్వారా క్లాసులు ప్రారంభించారు. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు 18.43 లక్షల మంది చదువుతుంటే.. అందులో కేవలం 13 లక్షల దాకా స్టూడెంట్లు టీవీలు, సెల్​ఫోన్లు, లాప్​టాప్​ల ద్వారా పాఠాలు వింటున్నారు. మిగతా స్టూడెంట్లు పాఠాలు వినడం లేదు. మరోపక్క ఇంటర్మీడియెట్​లో  సెకండియర్ ​స్టూడెంట్లకు మాత్రమే డిజిటల్ పాఠాలు మొదలయ్యాయి. గవర్నమెంట్​ ఇంటర్​ సెకండియర్​లో  మొత్తం 80 వేల మంది స్టూడెంట్లు ఉండగా, వారిలో 70 శాతం మంది మాత్రమే పాఠాలు వింటున్నారని అధికారులు చెప్తున్నారు. స్టూడెంట్లందరూ క్లాసులు వినేలా చేయడంలో స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్ బోర్డు పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. ఆన్​లైన్​ క్లాసులపై పిల్లలకు అవగాహన కల్పించడం లేదు. 
అకడమిక్  క్యాలెండర్​ ఏది?
ఈ నెల ఫస్ట్  నుంచి ఇంటర్‌‌ సెకండియర్ క్లాసులు స్టార్టయినా ఇప్పటికీ అకడమిక్ క్యాలెండర్  ప్రకటించలేదు. మే 27 నుంచి ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియ ప్రారంభమై దాదాపు రెండు నెలల కావొస్తుంది. ఇప్పటి వరకు 85 వేల మంది వరకు సర్కారు కాలేజీల్లో చేరారు. అయితే వారికి ఎప్పుడు ఆన్​లైన్ క్లాసులు ప్రారంభిస్తారో  చెప్పడం లేదు. గతంలో జూన్ ఫస్ట్ నుంచి అని చెప్పిన ఇంటర్ బోర్డు అధికారులు.. తర్వాత వాయిదా వేశారు. స్కూల్ స్టూడెంట్లకు జులై ఫస్ట్ నుంచి ఆన్​లైన్​లో బ్రిడ్జికోర్సు కొనసాగుతుండగా, ఆగస్టు1 నుంచి రెగ్యులర్ పాఠాలు స్టార్ట్ కానున్నాయి. అయితే ఇప్పటికీ వారికి కూడా అకడమిక్ క్యాలెండర్ ప్రకటించడం లేదు. దీంతోపాటు స్కూల్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్​లో ఎంత సిలబస్ చెప్పాలనే దానిపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు ఇప్పటికీ ఇంటర్  సెకండియర్​ స్టూడెంట్లకు పుస్తకాలు అందలేదు. ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ కూడా పూర్తికాలేదు.
బోర్డు ఎగ్జామ్స్​ ముచ్చట్నే లేదు
టెన్త్, 12వ తరగతి ఎగ్జామ్స్​ను రెండుసార్లు పెడ్తామని సీబీఎస్ఈ బోర్డు ప్రకటించింది. అయితే అనేక విషయాల్లో సీబీఎస్ఈని ఫాలో అవుతున్నామని చెప్పే రాష్ట్ర సర్కారు మాత్రం ఎగ్జామ్స్​పై ఇంకా చర్చలే మొదలుపెట్టలేదు. గత అకడమిక్​ ఇయర్​లో ఇంటర్  ఫస్టియర్ ​స్టూడెంట్లకు పరీక్షలు పెట్టకుండానే, అందరినీ ప్రమోట్ చేశారు. వారందరికీ ఎగ్జామ్స్​ పెడ్తామని చెప్పిన సర్కారు.. ఎప్పుడు పెడ్తామన్న దానిపై క్లారిటీ ఇవ్వడం లేదు. 
వీవీలను, గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేస్తలే
విద్యాశాఖను నిధుల కొరత వేధిస్తోంది. నిధులిచ్చేందుకు సర్కారు సతాయిస్తోంది. దీంతో స్కూళ్లలో పనిచేసే విద్యా వాలంటీర్లను, పార్ట్ టైమ్ ఇన్​స్ర్టక్టర్స్ ను, జూనియర్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లను, మోడల్ స్కూళ్లలో పనిచేసే అవర్లీ బేస్డ్ టీచర్లను రెన్యువల్ చేయలేదు. నిరుడు కూడా రెన్యువల్​ చేయలేదు. కనీసం ప్రైవేటు స్కూల్ టీచర్లకు ఇచ్చినట్లుగా డబ్బు సాయం కూడా చేయకపోవడంతో వారంతా ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. రెన్యువల్ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. సర్కారు బడుల్లో పనిచేసే 28 వేల మంది స్వచ్ఛ కార్మికులను ఈ ఏడాది విధుల్లోకి తీసుకోలేదు. 
ముందుకు సాగని రూ. 2 వేల కోట్ల స్కీమ్
సర్కారు స్కూళ్లను రూ. 2 వేల కోట్లతో డెవలప్ ​చేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీని గైడ్​లైన్స్​ రూపొందించేందుకు అధికారులు రెండు సార్లు ఏపీ, ఢిల్లీకి వెళ్లి అక్కడి స్కూళ్లను పరిశీలించి వచ్చారు. రిపోర్టు కూడా కేబినెట్ సబ్​ కమిటీకి ఇచ్చారు. కానీ ఇప్పటికీ దానిపై ఓ క్లారిటీ రాలేదు. 
ఇట్లనే ఉంటే ఇబ్బందులే
స్కూళ్లు, కాలేజీల్లో ఏమైనా సంక్షోభం వస్తే తప్ప, ముందుచూపుతో నివారణ చర్యలు తీసుకోవాలనే ఆలోచన విద్యాశాఖలో కనిపించడం లేదు. ఇంటర్​ ఫస్టియర్ అడ్మిషన్లు ప్రారంభించి రెండు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఆన్​లైన్​ క్లాసులు కూడా మొదలుపెట్టలేదు. ఆఫ్​లైన్​ తరగతులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. గత అకడమిక్​ ఇయర్​లో ప్రమోట్​ చేసిన ఫస్టియర్ స్టూడెంట్లకు ఎగ్జామ్స్ పెడ్తామన్నరు కానీ..  ఎప్పుడు పెడతారో చెప్పడం లేదు. కరోనా ఇలాగే కొనసాగితే, ఏం చేయాలనే దానిపైనా ఓ ప్లాన్​ లేదు. పరిస్థితి ఇట్లనే ఉంటే స్టూడెంట్లకు భవిష్యత్​లో ఇబ్బందులు తప్పవు. 
                                                                                                                                                           ‑ మధుసూధన్​రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ 
ఎడ్యుకేషన్​కు నిధులు పెంచాలి
సర్కారు స్కూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దాంట్లో భాగంగానే విద్యాశాఖకు ఏడేండ్ల నుంచి ఏటేటా నిధులు తగ్గిస్తూ వస్తోంది. ఉమ్మడి ఏపీలో బడ్జెట్​లో 11శాతం నిధులిస్తే, ప్రస్తుతం 6.4 శాతానికి పడిపోయింది. సర్కారు బడులపై విశ్వాసం కల్గించే చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా విద్యారంగాన్ని ప్రాధాన్య రంగంగా గుర్తించి నిధులు పెంచాలి. టీచర్లను రిక్రూట్​ చేయాలి.                                                                                 ‑ రఘుశంకర్​రెడ్డి, డీటీఎఫ్​ స్టేట్ ప్రెసిడెంట్ 
అకడమిక్ క్యాలెండర్ ఇయ్యాలె
ఇంటర్​ సెకండియర్​ స్టూడెంట్లకు ఆన్​లైన్ క్లాసులు స్టార్టయి నెల రోజులైనా ఇంటర్​ బోర్డు అధికారులు ఇప్పటికీ అకడమిక్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. దీంతో కాలేజీలు ఎన్నిరోజులు నడుస్తాయి?  సిలబస్ ఎంత చెప్పాలనే దానిపై లెక్చరర్లలో అయోమయం నెలకొంది. వెంటనే లెక్చరర్ల సంఘాలతో విద్యాశాఖ అధికారులు చర్చించి, అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇంటర్ స్టూడెంట్లకు పుస్తకాలు వెంటనే ఇవ్వాలి. 
                                                                                                                                                        ‑ రామకృష్ణాగౌడ్,   టీఐజీఎల్​ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి