పట్టాలిస్తామంటూ అటు అడవిబిడ్డలను ఊరించుడు

పట్టాలిస్తామంటూ అటు అడవిబిడ్డలను ఊరించుడు
  • ట్రెంచ్​లు కొట్టాలంటూ ఇటు ఫారెస్టోళ్లను ఆదేశించుడు
  • ప్రభుత్వ తీరుతో ఇరువర్గాల నడుమ నిత్యం లొల్లులు

హైదరాబాద్​, వెలుగు: పోడు భూముల సమస్యపై రాష్ట్ర సర్కార్​ అనుసరిస్తున్న నాన్చుడు ధోరణి ఫారెస్ట్​ ఆఫీసర్లు, రైతుల నడుమ లొల్లులకు దారితీస్తున్నది. ప్రాణాలమీదికి తెస్తున్నది. తానే కుర్చీ వేసుకుని పోడు రైతులకు పట్టాలిచ్చేస్తానని సీఎం కేసీఆర్​ ఏండ్లుగా ఊరిస్తున్నారు. కానీ, ఇంతవరకు పట్టాలు ఇచ్చింది లేదు. గత ఏడాది అర్హులైన పోడు సాగుదారుల నుంచి అప్లికేషన్లు తీసుకున్నా,  కమిటీలు వేసినా.. ఫాయిదా లేకుండాపోయింది. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​కు ఒకలా.. మరోవైపు పోడు భూముల అప్లికేషన్లపై ట్రైబల్​ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​కు ఇంకోలా ఆర్డర్స్​ వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో పోడు భూముల్లో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నిస్తుండటం, ట్రెంచ్​లు కొడ్తుండటం..  తాము  ఏండ్ల నుంచి సాగుచేసుకుంటున్న భూముల్లో మీరు ట్రెంచ్​లు ఎట్లా కొడ్తారంటూ రైతులు ఆందోళనకు దిగుతుండటంతో అక్కడ నిత్యం యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. లొల్లులు, దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు వివిధ జిల్లాల్లో గత ఏడేండ్లలో 843 జరిగాయి. రెండు రోజుల కింద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్​ఆర్వో హత్యకు గురయ్యారు.

అప్లికేషన్లు తీసుకున్నా..!

పోడు పట్టాలపై సీఎం కేసీఆర్​ 8 సార్లు వివిధ సందర్భాల్లో ప్రకటన చేశారు. ప్రతిసారీ చెప్పడమే కానీ ఎలాంటి ఆదేశాలు అధికారులకు జారీ చేయలేదు. అన్ని ప్రకటనల తర్వాత పోయిన ఏడాది మంత్రి సత్యవతి రాథోడ్​ అధ్యక్షతన పోడు భూములపై కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేశారు. అప్పట్లోనే  రాష్ట్రంలో 2,450 గిరిజన గ్రామాల (4,300 ఆవాసాల) పరిధిలో పోడు భూముల సమస్యలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రి సత్యవతి ఆధ్వర్యంలోని కమిటీ రిపోర్ట్​ ఇచ్చిన రెండు నెలలకు పోడుపై అప్లికేషన్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా పోడు భూములపై హక్కులు కల్పించేందుకు​గత సంవత్సరం నవంబర్​ 8 నుంచి అప్లికేషన్లు తీసుకున్నది. అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం.. దాదాపు 6 లక్షల ఎకరాల విస్తీర్ణంపై పట్టాల  కోసం అప్లికేషన్లు వస్తాయని అధికారులు అనుకున్నారు. అయితే 13.18 లక్షల ఎకరాలకు సంబంధించి 4.14 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో 3.5 లక్షల అప్లికేషన్లు పోడు పట్టాలకు ఎలిజిబుల్​ ఉన్నట్లు  తేల్చారు. 3 నెలల నుంచి 6 నెలలోపు పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు అడుగు ముందుకు పడలేదు. పైగా ఈ వ్యవహారాన్ని రాష్ట్ర సర్కార్​ పొలిటికల్​గా వాడుకునేందుకు కేంద్రంపై నెట్టేసే ప్రయత్నం చేసింది. చివరికి ఏడాది తర్వాత ఇటీవల పోడు భూములపై ఫారెస్ట్​, ట్రైబల్​, రెవెన్యూ  డిపార్ట్​మెంట్ల ఆఫీసర్ల కమిటీలు అప్లికేషన్లు పరిశీలించాయి. ఇంకా కొన్ని గ్రామాల్లో ఇది పూర్తి కాలేదు. అదంతా అయిపోయిన తర్వాత  వీటిపై గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడంతో పాటు  గ్రామసభల తీర్మానాలు చేయించాలి. వీటిని డివిజన్‌‌, జిల్లాస్థాయి కమిటీలు ఆమోదించాలి. ఆ తర్వాత పోడు పట్టాలపై స్పష్టత వస్తుంది. 

ఫారెస్టోళ్లను బద్నాం చేస్తున్న లీడర్లు

పోడు భూములపై రాష్ట్ర సర్కార్​ సమన్వయ లోపం, విరుద్ధ ప్రకటనలతోనే ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఫారెస్ట్​ ఆఫీసర్లు చెప్తున్నారు. ఒకవైపు ఫారెస్ట్​ ఆఫీసర్లతో పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటిస్తూ.. మరోవైపు పోడు సాగుదారులకు పట్టాలిస్తామంటూ ప్రభుత్వం చెప్తూ వస్తున్నది. గత కొన్నేండ్లుగా మొక్కలు నాటేందుకు వస్తున్న ఫారెస్ట్​ సిబ్బందిని గిరిజనులు అడ్డుకోవడంతో ఇరువైపులా దాడులు, పోడు రైతులపై కేసులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రం వచ్చాక ఇద్దరు ఫారెస్ట్​ ఆఫీసర్లు హత్యకు గురయ్యారు. టీఆర్​ఎస్​ లీడర్లు అధికారులపై దాడులు చేసేలా పోడు సాగుదారులను రెచ్చగొట్టిన సంఘటనలూ ఉన్నాయి. ఒకసారి పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ‘‘హైదరాబాద్​ నుంచి రాగానే ఫారెస్ట్​ అధికారులతో ప్రత్యక్ష యుద్ధం.. చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధం కండి ప్రజలతో కలిసి.. ప్రజలకోసం’’ అంటూ గతంలో ఫేస్​బుక్​ వేదికగా పోస్ట్​ పెట్టారు. 2019లో  ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌‌నగర్‌‌లో ఫారెస్ట్ అధికారులపై.. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణ, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆదిలాబాద్, -కుమ్రం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, జయశంకర్​ భూపాలపల్లి, -భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఖమ్మం, నాగర్​కర్నూల్ జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం పోడుసాగుదారులను ఊరిస్తున్నారు. పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అనుకూలంగా ఉందంటూనే.. ఫారెస్ట్​ ఆఫీసర్లే వ్యతిరేకంగా ఉన్నారనే భావనను కలుగచేస్తున్నారు. దీని వల్ల గిరిజనుల ముందు తాము దోషులుగా మారాల్సి వస్తున్నదని ఫారెస్ట్​ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆశలు పెంచుతూ.. సమస్యలు తెచ్చి పెట్టిన్రు

2005 కంటే ముందు నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. కానీ, రాష్ట్రంలో 2005 కంటే ముందు సాగులో ఉన్న 95 శాతం పోడు భూములకు 2006, 2007లో అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, ఇంకొక 5 శాతం భూములకే ఇవ్వలేదని ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. ‘‘ఇప్పుడు పట్టాల కోసం వస్తున్న అప్లికేషన్లలోనూ  ఎక్కువగా కొత్తగా పోడు చేసిన భూములవే ఉంటున్నాయి. అయితే  కొంత మంది ప్రజాప్రతినిధులు ఎంక్రోచర్లకు పట్టాలపై ఆశలు పెంచుతున్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లే అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తున్నారంటూ మాపై నెట్టేస్తున్నారు. దీని వల్ల పారెస్ట్​ ఆఫీసర్ల మీద పోడు రైతులు కక్ష పెంచుకుంటున్నారు” అని ఓ ఫారెస్ట్​ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూములను కాపాడాలని, ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కానివ్వొద్దని, అటవీ భూముల చుట్టూ  కందకాలు తవ్వాలని ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారని అన్నారు. ఇటు పట్టాలిస్తామని రైతులకు చెప్తూనే.. తమను భూముల్లో కందకాలు తవ్వాలని ఆదేశించడం ఏమిటని ప్రశ్నించారు.

పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్త. నేనే బయలుదేరుతా.. మొత్తం మంత్రివర్గాన్ని, అధికార గణాన్ని  కూడా వెంబట తీసుకెళ్లి.. నేనే అక్కడ కుర్చీ వేసుకుని కూర్చొని వాట్ ఇజ్ వాట్.. వాట్ ఇజ్ నాట్.. అనేది తేల్చేస్త. ప్రజాదర్బార్లు బెట్టి.. పట్టాలు ఇచ్చేస్త. - అసెంబ్లీ సహా వివిధ వేదికలపై పలుమార్లు సీఎం కేసీఆర్​ ప్రకటన ఇది

మాకు రక్షణ కల్పించాలి

ఫారెస్ట్ ఆఫీసర్లకు వెపన్స్​పై కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఆయుధాలు ఇచ్చే దాకా పోలీసులతో రక్షణ కల్పించాలి. అప్పటిదాకా పోడుకు సంబంధించిన సర్వేలు, గ్రామసభలు బహిష్కరించాలని నిర్ణయించుకున్నాం. 2014లో ఇందల్వాయి ఎఫ్‌‌ఆర్వో గంగన్నను తలపై నరికి చంపినప్పుడు కూడా, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2019లో ఎఫ్‌‌ఆర్వో అనిత మీద దాడి జరిగినప్పుడు కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. ఆమెపై దాడి చేసిన వారికి ఇప్పటికీ శిక్ష పడలేదు. గతేడాది నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలో దివ్య అనే ఆఫీసర్‌‌‌‌పై పెట్రోల్‌‌ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. -నరేందర్‌‌‌‌, జనరల్ సెక్రటరీ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్‌‌

ప్రభుత్వ తీరు సరిగ్గా లేదు..

ఎఫ్​ఆర్వో హత్యను ఖండిస్తున్నం. పోడుపై ప్రభుత్వ వ్యవహారమే సరిగ్గా లేదు. ఫారెస్ట్​ అధికారులు అగ్రెసివ్​గా వెళ్తున్నారు. చట్టాన్ని ఫాలో కావడం లేదు. వలస వచ్చిన ఆదివాసీలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 30 ఏండ్ల కింద వాళ్లు వచ్చారు. అటవీ గుర్తింపు చట్టం 2006 ప్రకారం అటవీ గ్రామాలు అనేవి లేకుండా.. రెవెన్యూ గ్రామాలుగా వాటిని మార్చి.. వారికి హక్కులు కల్పించాలి. 2006 కంటే ముందుకు సాగులో ఉన్నప్పటికీ వారికి ఇచ్చే విషయమై స్పష్టత ఇవ్వట్లేదు. పార దర్శకంగా పోడు సర్వే చేయట్లేదు.  - ఆర్​.శ్రీరాం నాయక్​, రాష్ట్ర ప్రధానకార్యదర్శి,  తెలంగాణ గిరిజన సంఘం