సమ్మెకు పోతే ఉద్యోగం ఊస్ట్‌‌?

సమ్మెకు పోతే ఉద్యోగం ఊస్ట్‌‌?

హైదరాబాద్‌‌, వెలుగుఆర్టీసీ యూనియన్ల సమ్మె నిర్ణయంపై సర్కారు సీరియస్‌‌గా ఉంది. స్ట్రైక్‌‌కు వెళ్తే కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలిసింది. ఇందుకోసం ఉన్నతాధికారులు లొసుగులు వెతుకుతున్నట్టు సమాచారం. ‘ఆర్టీసీలోని వాళ్లందరూ పబ్లిక్‌‌ సర్వెంట్లే. చట్టంలోని ఓ సెక్షన్‌‌ ఇదే విషయం చెబుతోంది. సమ్మెకు పోతే ఉద్యోగాలు పోవడం ఖాయం. ఆ పవర్స్‌‌ ప్రభుత్వానికి ఉన్నాయి. గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు సమ్మెకు పోతే ఇట్లే జరిగింది’ అని సీఎంకు దగ్గరగా ఉండే ఓ ఉన్నతాధికారి చెప్పారు. దసరా టైంలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునే పరిస్థితిలో లేరని, మంత్రిమండలి విన్నవించినా వెనక్కితగ్గకపోతే ఇక వారి ఇష్టమని చెప్పుకొచ్చారు.

డ్రైవర్లకు రోజుకు రూ. 1,500

యూనియన్లతో కమిటీ చర్చలు జరుపుతుండగానే.. సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీఏ అధికారులకు లీవ్‌‌లు రద్దు చేస్తూ ఆ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఒక్కో డిపో దగ్గర ఇద్దరు ఎంవీఐలను ఏర్పాటు చేయనుంది. అర్హత ఉన్న ప్రైవేట్‌‌ డ్రైవర్లను వీళ్లే ఎంపిక చేయనున్నారు. బండ్ల పర్మిట్లను తగ్గిస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు చెప్పారు. వారానికి రూ.100 ట్యాక్స్‌‌, రూ. 200 పర్మిట్ ఫీజు కట్టి స్టేట్‌‌ క్యారేజ్ పర్మిట్లు తీసుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చవచ్చని స్పష్టం చేశారు. కొన్ని జిల్లాల్లోనైతే టెంపరరీగా పని చేసేందుకు డ్రైవర్లు, కండక్టర్ల కోసం ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంటర్వ్యూకు ఒరిజినల్‌‌ సర్టిఫికెట్లతో రావాలని చెప్పారు. డ్రైవర్లకు రోజుకు రూ.1,500, కండక్టర్లకు రూ. వెయ్యి చొప్పున ఇవ్వనున్నారు.