ఈడీ నోటీసులు ఇచ్చిన ప్రతీసారి కవిత ఇట్లనే చేస్తుంది: విప్ ఆది శ్రీనివాస్

ఈడీ నోటీసులు ఇచ్చిన ప్రతీసారి కవిత ఇట్లనే చేస్తుంది: విప్ ఆది శ్రీనివాస్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో  జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఇటీవల కవిత రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. జ్యోతిరావు ఫూలే గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని ఫైర్ అయ్యారు. ఏ రోజూ ఫూలే జయంతి, వర్దంతి వేడుకలకు కేసీఆర్ హాజరుకాలేదని.. అప్పుడు స్పందించకుండా ఇప్పుడొచ్చి మాట్లాడడమేంటని ప్రశ్నించారు. బీసీ ఓట్ల కోసం కవిత.. ఫూలే విగ్రహం అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారని ఆయన విమర్శించారు.

ఈడీ నోటీసులు వచ్చిన ప్రతీసారి కవిత.. ఇలాంటి కొత్త అంశాన్ని తెరపైకి తెస్తారని మండిపడ్డారు. పూలే ఆశయాలు నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని కవితను ప్రశ్నించారాయన. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు చోట్ల.. ఫూలే విగ్రహాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు.  అధికారంలో ఉన్నప్పుడు ఫూలే విగ్రహం పెట్టకుండా ఇప్పుడు మాకు డెడ్ లైన్ పెట్టడం రాజకీయం కాదా అంటూ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫూలే విగ్రహాన్ని రాజకీయం చేస్తున్నది కవితేనన్నారు.

ప్రగతిభవన్ ను జ్యోతిరావు ఫూలే భవన్ గా.. కవిత చెప్తేనే చేశామా.. మాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని చురకలు అంటించారు. చివరికి బతుకమ్మను కూడా రాజకీయం చేసిందని... కవిత ఏం చేసినా రాజకీయం కోసమే చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటులో మాత్రమే బీఆర్ఎస్ ఫైట్ ఇస్తుందని.. మిగతా చోట్ల నామమాత్రపు పోటీనే చేస్తుందని విప్ ఆదిశ్రీనివాస్ అన్నారు.