రేవంత్​పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం

రేవంత్​పై ఉన్న కేసుల వివరాలు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తనపై పోలీసులు వేర్వేరు చోట్ల పెట్టిన కేసుల గురించి వివరాలు అడిగితే ఇవ్వ డం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌‌‌‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసుల వివరాలు ఇవ్వకపోతే అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌‌‌‌లో వివరాలు ఎలా సమర్పించగలరని పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్‌‌‌‌ అడిగిన కేసుల వివరాలను తెలియజేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. 

ఎలక్షన్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ అయిందని, పిటిషనర్‌‌‌‌ తన నామినేషన్‌‌‌‌ దాఖలు చేయాలి కదా అని జస్టిస్‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. ఒక ప్రజాప్రతినిధి, ప్రతిపక్ష నేత అడిగిన సమాచారాన్ని ఇవ్వకపోవడం సబబు కాదని కోర్టు అభిప్రాయపడింది. 

విచారణ 17కి వాయిదా..

రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్‌‌‌‌ స్టేషన్లలో తనపై దాఖలైన క్రిమినల్‌‌‌‌ కేసుల వివరాలు ఇవ్వాలని కోరుతూ అక్టోబర్‌‌‌‌ 3న డీజీపీకి వినతిపత్రం ఇస్తే ఫలితం లేదంటూ రేవంత్‌‌‌‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. ఆయన తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌‌‌‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 2009, 2014లో జరిగిన వరుస ఎన్నికల్లో కొడంగల్‌‌‌‌ నుంచి రేవంత్‌‌‌‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, 2019లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారని, పీసీసీ చీఫ్‌‌‌‌గా ఉన్నారని వివరించారు. 

ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రేవంత్‌‌‌‌పై అధికార పార్టీ అనుచరులు పలు కేసులు పెట్టారని, వాటిలో పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు తెలియజేయాలని కోరితే ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రెండేళ్లలోనే రేవంత్‌‌‌‌పై దాదాపు 20 కేసులు విచారణకు రాగా, వాటన్నింటిలో నాంపల్లిలోని ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రత్యేక కోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. కేసుల వివరాల సేకరణలో పోలీసులు ఉన్నారని ప్రభుత్వ న్యాయవాది ముజీబ్‌‌‌‌ చెప్పారు. విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది.