పాలిసెట్లో అమ్మాయిలదే హవా..82.94 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై

పాలిసెట్లో అమ్మాయిలదే హవా..82.94 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై
  • బాలికలు 86.38 శాతం, బాలురు 79.92 శాతం ఉత్తీర్ణత
  • వెబ్‌‌ సైట్‌‌ లో ర్యాంక్ కార్డులు.. వాట్సాప్‌‌ కూ సమాచారం
  • ఆన్​లైన్ లో ఓఎమ్మార్ షీట్లను చూసుకునే వెలుసుబాటు
  • అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు
  • త్వరలోనే వెబ్ కౌన్సిలింగ్ కు షెడ్యూల్ విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్–-2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అమ్మాయిలు తమ ఆధిపత్యాన్ని చాటారు. శనివారం సాంకేతిక విద్యాభవన్ లో సాంకేతిక విద్యామండలి కమిషనర్ శ్రీదేవసేన పాలిసెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఈనెల 13న జరిగిన పరీక్షకు మొత్తం 1,06,439 మంది దరఖాస్తు చేసుకోగా, 98,029 మంది హాజరయ్యారు. ఇందులో 81,307 మంది అంటే 82.94 శాతం విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.

అమ్మాయిలదే అప్పర్ హ్యాండ్..

ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా పాలిసెట్​ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పరీక్షకు 45,828 మంది బాలికలు హాజరు కాగా, 39,588 మంది అంటే 86.38 శాతం ఉత్తీర్ణత సాధించారు. 52,201 మంది బాలురల్లో 41,719 మంది అంటే 79.92 శాతం మాత్రమే గట్టెక్కారు. బాలుర కంటే బాలికలు 6.46 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. స్ట్రీమ్స్ వారీగా చూస్తే ఎంపీసీ విభాగంలో 82.94 శాతం, బైపీసీ విభాగంలో 81.25 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. 

క్వాలిఫైయింగ్ మార్కులు ఇవే.. 

పాలిసెట్–2026లో అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు 120 మార్కులకు 30 శాతం అంటే 36 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీసం ఒక మార్కు వచ్చి ఉండాలి. దీంతో పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులంతా అర్హత సాధించారు. ఈ క్రమంలో 18,481 మంది ఎస్సీ విద్యార్థులు, 8,817 మంది ఎస్టీ విద్యార్థులు మెరిట్ ర్యాంకులు సాధించారు.

ఆన్​లైన్​ లో ర్యాంక్ కార్డులు,  ఓఎంఆర్ షీట్లు.. 

అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌‌ సైట్ https://polycet.sbtet.telangana.gov.in  నుంచి డౌన్‌‌ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పిస్తూ వారు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్లకు వాట్సాప్ ద్వారా కూడా ర్యాంక్ కార్డులను పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, పారదర్శకత కోసం విద్యార్థులు పరీక్షలో బబ్లింగ్ చేసిన తమ ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్‌‌ సైట్ నుంచి చూసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 

యూనివర్సిటీ కోర్సులకు వేర్వేరుగా అడ్మిషన్లు..

పాలిసెట్ ర్యాంకు ఆధారంగా ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు. అయితే, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(పీజేటీఏయూ), శ్రీ కొండా లక్ష్మణ్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ఎస్ కేఎల్​టీఎస్​హెచ్ యూ), పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్టీవీయూ) తమ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయని, అభ్యర్థులు ఆయా వెబ్‌‌ సైట్లను గమనించాలని అధికారులు సూచించారు.

కౌన్సెలింగ్ అలర్ట్.. 

అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌‌ ను ప్రకటిస్తారు. అభ్యర్థులకు విడిగా ఎలాంటి కాల్ లెటర్లు పంపబడవు. పత్రికా ప్రకటన సమాచారం ఆధారంగానే సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌‌ కు హాజరుకావాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో కౌన్సెలింగ్‌‌ కు హాజరుకాని వారు సీట్ల కేటాయింపునకు అనర్హులవుతారని సాంకేతిక విద్యామండలి స్పష్టం చేసింది.

నర్సంపేట విద్యార్థికి స్టేట్​ ఫోర్త్​ ర్యాంక్..

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో విజ్​డమ్ హైస్కూల్​కు చెందిన షేక్ ఫర్మాన్ షా పాలిసెట్​ఫలితాల్లో స్టేట్​ఫోర్త్ ర్యాంకు సాధించినట్లు ఆ పాఠశాల డైరెక్టర్ జావెద్ తెలిపారు. 120 మార్కులకు 119 సాధించినట్లు వెల్లడించారు. షేక్ అర్మాన్ షా స్టేట్ 48వ ర్యాంకు, గౌతమ్ స్టేట్ 350వ ర్యాంకు సాధించగా, 2 వేలలోపు 12 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించినట్లు డైరెక్టర్ వివరించారు.